- పలు కీలక పదవుల్లో కొత్త నియామకాలు!
Konda Surekha Sacked From TG Cabinet తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు ఆమెను కేబినెట్ నుంచి తొలిగించాలని కోరుతూ గవర్నర్‌కు అధికారిక సిఫారసు లేఖను పంపినట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీంతో ఆమెను కేబినెట్ నుంచి తప్పించే ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది.
కీలక పదవుల్లో కొత్త నియామకాలు..
మంత్రివర్గం నుంచి కొండా సురేఖ ఉద్వాసనతో పాటు రాష్ట్రంలోని పలు కీలక సంస్థలు, కమిషన్లకు సీఎం రేవంత్ రెడ్డి కొత్త అధిపతులను నియమించారు. తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా మండలి వైస్ చైర్మన్‌గా ఉన్న డాక్టర్ జి. చిన్నారెడ్డి నియామకాన్ని సీఎం రద్దు చేశారు. ఆయన స్థానంలో గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని ప్రణాళికా మండలి వైస్ చైర్మన్‌గా నియమించారు.
మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నెరెళ్ల శారద..
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నూతన చైర్‌పర్సన్‌గా నెరెళ్ల శారద నియామకానికి సీఎం ఆమోదం తెలిపారు. మాజీ రాజ్యసభ సభ్యురాలు జి. సుధారాణికి కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (KUDA) చైర్‌పర్సన్‌గా కీలక బాధ్యతలు అప్పగిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు.
రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం..
ఒకేసారి మంత్రివర్గం నుంచి సీనియర్ నాయకురాలు కొండా సురేఖను తప్పించడం, అలాగే ప్రణాళికా మండలి, మహిళా కమిషన్, కుడా వంటి నామినేటెడ్ పదవుల్లో కొత్త వారిని నియమించడం రాష్ట్ర పరిపాలనా మరియు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో చోటుచేసుకున్న ఈ ఆకస్మిక పరిణామాలు తెలంగాణ రాజకీయాన్ని వేడెక్కించాయి.







