CM Revanth Inspects Meeralam Tank హైదరాబాద్‌లోని చారిత్రాత్మక మీరాలం ట్యాంక్‌ను ప్రముఖ అంతర్జాతీయ పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దే ప్రణాళికల్లో భాగంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో సాగుతున్న అభివృద్ధి పనులను ఆయన ఒక్కొక్కటిగా స్వయంగా పరిశీలించారు.
క్రేన్‌పైకి వెళ్లి బ్రిడ్జి పరిశీలన..
మీరాలం చెరువుపై నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను సీఎం రేవంత్ రెడ్డి భారీ క్రేన్ సహాయంతో పైకి వెళ్లి ప్రత్యేకంగా పరిశీలించారు. ట్యాంక్ చుట్టూ జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను ఆయన ఓపెన్-టాప్ జీపులో ప్రయాణించి మొత్తం ప్రాంతాన్ని వీక్షించారు. కొనసాగుతున్న పనుల పురోగతి మరియు మాస్టర్ ప్లాన్‌పై అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను సీఎం పరిశీలించి, పలు సూచనలు చేశారు.
అధికారులకు కీలక ఆదేశాలు..
నిర్దేశిత గడువులోగా పనులన్నింటినీ పూర్తి చేయాలని అధికారులను ఖచ్చితంగా ఆదేశించారు. చెరువులోకి మురుగు నీరు చేరకుండా తగిన చర్యలు తీసుకోవాలని, అలాగే చెరువు నుండి మూసీ నదిలోకి వరద నీరు సురక్షితంగా వెళ్లేలా నాలాను విస్తరించాలని ఆదేశించారు.
పర్యాటకులను ఆకట్టుకునేలా చెరువులో వాటర్ స్పోర్ట్స్ సౌకర్యాలు డిజైన్ చేయాలని, చెరువు మధ్యలో ఉన్న ఐలాండ్లను అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని చెప్పారు.
అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరగా ఉన్నందున మీరాలం చెరువు ప్రాంతాన్ని అంతర్జాతీయ పర్యాటక హబ్‌గా రూపొందించాలని సూచించారు. ఈ ఆకస్మిక పర్యటనలో మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ మరియు మున్సిపల్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.











