Save Trees Campaign Raksha Bandhan ప్రజలకు, ప్రకృతికి మధ్య భావోద్వేగ బంధాన్ని పెంపొందించే దిశగా జార్ఖండ్ అటవీ శాఖ ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రక్షాబంధన్ పండుగను పురస్కరించుకుని శుక్రవారం రాష్ట్రంలోని 700 గ్రామాల్లో వేలాది మంది గ్రామస్థులు సుమారు 1 లక్ష చెట్లకు రాఖీలు కట్టనున్నారు.
‘సేవ్ ట్రీ’ నెల రోజుల సుదీర్ఘ ప్రచారం..
ఈ కార్యక్రమం గురించి ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి (PCCF) సంజీవ్ కుమార్ వివరాలను వెల్లడించారు. నెల రోజుల పాటు కొనసాగే ‘సేవ్ ట్రీ’ (చెట్లను కాపాడండి) ప్రచారంలో భాగంగా, రాష్ట్రంలోని 24 జిల్లాల్లో గుర్తించిన గ్రామాల్లో మొత్తం 3 లక్షల చెట్లకు రాఖీలు కట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
గుమ్లా జిల్లాలోని జోరాడ్ గ్రామంలో ఒక చెట్టుకు రాఖీ కట్టి ఈ ప్రచారాన్ని పీసీసీఎఫ్ ప్రారంభించనున్నారు. సోదరులు సోదరీమణులను కాపాడినట్లే, మన జీవితాలు ఆధారపడి ఉన్న పర్యావరణాన్ని కాపాడటం కూడా అందరి పరమ కర్తవ్యమని సంజీవ్ కుమార్ పేర్కొన్నారు.
2004లో మొదలైన ప్రతిజ్ఞ.. మారుతున్న వనరులు..
2004లో ధన్‌బాద్ జిల్లాలోని తుండి బ్లాక్‌లోని లుకయ్యా గ్రామం నుండి ఈ ఆలోచనతో కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పటివరకు 12,000కు పైగా గ్రామాలు దీనిలో భాగమయ్యాయి. లుకైయా గ్రామంలోనే ఈ ప్రచారం ద్వారా 20,000కు పైగా మహువా చెట్లను రక్షించడంతో, అవి గ్రామస్తుల జీవనోపాధికి మూలంగా మారాయి.
పెరిగిన అటవీ విస్తీర్ణం..
ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా (FSI) గణాంకాల ప్రకారం గత రెండు దశాబ్దాలలో (2001 నుండి) జార్ఖండ్ అటవీ విస్తీర్ణం 1,128 చదరపు కిలోమీటర్లు పెరిగింది. 2001లో 22,637 చదరపు కిలోమీటర్లు ఉండగా, 2023 నాటికి అది 23,765.78 చదరపు కిలోమీటర్లకు (రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 29.76%) పెరిగింది.
ఇందులో 2,635.35 చదరపు కిలోమీటర్లు అత్యంత దట్టమైనవి కాగా, 9,640.99 చదరపు కిలోమీటర్లు మధ్యస్తంగా, 11,489.44 చదరపు కిలోమీటర్లు విరళ అటవీ ప్రాంతంగా ఉన్నాయి. చెట్లను నాటడమే కాకుండా వాటికి ఎరువులు వేస్తూ, పోషించి రక్షించే బాధ్యతను సామూహికంగా చేపట్టాలని 77వ ‘వన మహోత్సవ్’ సందర్భంగా ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పిలుపునిచ్చారు.








