High Mast Light Collapse | విశాఖపట్నం రైల్వే స్టేడియంలో మంగళవారం ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. ఈదురు గాలుల ఉధృతికి స్టేడియంలో ఉన్న దాదాపు 50 అడుగుల ఎత్తైన హై-మాస్ట్ లైట్ (High-Mast Light) ఒక్కసారిగా కుప్పకూలింది.
ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం స్టేడియంలో ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరగడంతో అంతా ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
గ్యాలరీ వైపు కూలిన పోల్ – కార్మికులు లేకపోవడంతో తప్పిన ముప్పు:
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో స్టేడియంలో వేదిక, సిట్టింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో వీచిన ఈదురు గాలులకు 50 అడుగుల ఎత్తైన హై-మాస్ట్ లైటింగ్ పోల్ బ్యాలెన్స్ తప్పి, ప్రేక్షకులు కూర్చునే గ్యాలరీ వైపు కూలిపోయింది.
ఊపిరి పీల్చుకున్న అధికారులు
ప్రమాదం జరిగిన సమయంలో ఆ పోల్ పడిన పరిసర ప్రాంతంలో కార్మికులు లేదా సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు కాకపోవడంతో అధికారులు, నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు.
ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల వేదిక:
విశాఖపట్నంలోని ఈ రైల్వే స్టేడియం ఎంతో ప్రాధాన్యత కలిగింది. ఇక్కడ రెగ్యులర్‌గా అనేక ఫస్ట్-క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లు (First-Class Cricket Matches), రంజీ ట్రోఫీ గేమ్‌లతో పాటు ముఖ్యమైన ఫుట్‌బాల్ టోర్నమెంట్లు జరుగుతుంటాయి.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వంటి కీలక కార్యక్రమం సమీపిస్తున్న వేళ ఇలా హై-మాస్ట్ పోల్ కూలిపోవడంపై రైల్వే అధికారులు తక్షణమే స్పందించారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించి, శిథిలాలను తొలగించడంతో పాటు స్టేడియంలోని మిగిలిన లైటింగ్ పోళ్లు, స్ట్రక్చర్ల ఫిట్నెస్ను తనిఖీ చేసేందుకు చర్యలు చేపట్టారు.











