Monday 14th September 2026
12:07:03 PM
Home > తాజా > తెలంగాణలో వారికి కూడా పెన్షన్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!

తెలంగాణలో వారికి కూడా పెన్షన్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!

Thalassemia Pension In Telangana | రాష్ట్రంలోని తలసేమియా, సికిల్ సెల్ అనీమియా బాధితులందరికీ పెన్షన్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

అర్హులను వెంటనే గుర్తించాలని సూచించారు. ఆగస్టు 15 నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తుందని తెలిపారు.

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై మంత్రి సీతక్కతో కలిసి సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులకు కూడా సంతృప్తికర స్థాయిలో పెన్షన్లు అందించాలని ఆదేశించారు.

దివ్యాంగులు మరణించిన వెంటనే వారి భార్యలకు పెన్షన్ మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. ఈ ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం ఉండకూడదని స్పష్టం చేశారు.

మండల స్థాయిలో అభివృద్ధి పనులను ఎంపీడీవోలు పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. ప్రతి 45 రోజులకు మండల పరిషత్ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఈ సమావేశాలకు ఆహ్వానించాలని చెప్పారు.

రాష్ట్రంలో తారు రోడ్డు లేని గ్రామం ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రతి గ్రామానికి తారు రోడ్డు నిర్మించాలని ఆదేశించారు. ప్రతి గ్రామ పంచాయతీకి కార్యాలయం నిర్మించాలని సూచించారు. జనాభా ఆధారంగా పంచాయతీలను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించి భవనాలు నిర్మించాలని తెలిపారు.

ఎన్నికలు జరగని పంచాయతీల్లో కూడా పారిశుద్ధ్య పనులకు ఆటంకం లేకుండా వెంటనే నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.

కోటి మంది మహిళలకు పంపిణీ చేసే ఇందిరమ్మ చీరలు నాణ్యతతో ఉండాలని సీఎం సూచించారు. ఆకర్షణీయమైన డిజైన్ల కోసం ఎన్ఐఎఫ్‌టీ విద్యార్థుల సేవలను వినియోగించాలని తెలిపారు. రంగులు, నాణ్యత విషయంలో రాజీ పడవద్దని చెప్పారు.

ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. గ్రామీణ తాగునీటి శాఖ, హైదరాబాద్ మెట్రో వాటర్, నీటి పారుదల శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తాగునీటికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.

గ్రామీణ తాగునీటి పథకాల సిబ్బందికి ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు చెల్లించాలని సీఎం ఆదేశించారు. స్థానిక నీటి వనరులను వినియోగిస్తూ తాగునీటి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఈ సమావేశంలో ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

You may also like
ఆయన వన్ టైం వండర్.. సీఎం రేవంత్ పై సంజయ్ బారు కీలక వ్యాఖ్యలు!
‘విద్యార్థులను స్కిల్స్ వైపు మళ్లించాలి’
రాజకీయ నైతికతకు ప్రతీక జైపాల్ రెడ్డి: సీఎం రేవంత్
హైడ్రా పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions