Modi On Anti Paper Leak Bill | పార్లమెంటులో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు-2026 ఆమోదం పొందడాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. భారత పరీక్షా వ్యవస్థను మరింత విశ్వసనీయంగా మార్చే చారిత్రాత్మక నిర్ణయమిదని ఆయన పేర్కొన్నారు.
సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన వీడియోలో ప్రధాని మోదీ మాట్లాడారు. దేశంలో పేపర్ లీక్ ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనలో బలమైన పరీక్షా వ్యవస్థ కీలకమని చెప్పారు.
దశాబ్దాలుగా రాష్ట్ర, కేంద్ర స్థాయిలో పేపర్ లీక్ ఘటనలు జరుగుతున్నాయని మోదీ గుర్తు చేశారు. అందుకే పరీక్షల నిర్వహణలో అక్రమాలను అరికట్టేందుకు కఠిన చట్టం తీసుకురావాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.
పార్లమెంట్ ఉభయ సభల్లో విస్తృత చర్చల అనంతరం బిల్లుకు ఆమోదం లభించిందని తెలిపారు. ఇది విశ్వసనీయ పరీక్షా వ్యవస్థ నిర్మాణంలో కీలక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు.
ఈ బిల్లు బుధవారం లోక్‌సభలో ఆమోదం పొందింది. అనంతరం రాజ్యసభ కూడా మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఇప్పుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం కోసం పంపనున్నారు.
సవరణ బిల్లు ప్రకారం పేపర్ లీక్‌లు, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన వారికి కనీసం ఐదేళ్ల నుంచి గరిష్టంగా పదేళ్ల వరకు జైలు శిక్ష విధించనున్నారు. రూ.50 లక్షల వరకు జరిమానా కూడా ఉంటుంది. వ్యవస్థీకృత నేరాలకు కనీసం ఏడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 కోట్లకు తగ్గని జరిమానా ప్రతిపాదించారు.
అయితే ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లును విమర్శించాయి. ఇది సమస్యకు పూర్తి పరిష్కారం కాదని పేర్కొన్నాయి. ఢిల్లీలో నిరసన తెలిపిన విద్యార్థులపై పోలీసుల చర్యపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి.
దీనిపై బీజేపీ స్పందించింది. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం సున్నితంగా పరిగణిస్తోందని తెలిపింది. పరీక్షా వ్యవస్థలో పారదర్శకత, విశ్వసనీయత పెంచేందుకు అవసరమైన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.











