Revanth Reddy Comments On HYDRA | దిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యా వ్యవస్థ, పరీక్షల నిర్వహణ, ఫీజు రీఎంబర్స్‌మెంట్, హైడ్రా వ్యవహారం, భూ ఆక్రమణలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
మీడియాతో మాట్లాడిన ఆయన రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు, కేంద్ర విధానాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.
ఆఫ్‌లైన్ పరీక్షల్లోనే ఎక్కువ సమస్యలు
ఆఫ్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించడం వల్లే ఎక్కువగా అక్రమాలు, సమస్యలు వెలుగులోకి వస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
విద్యాశాఖలో రాష్ట్రాల పరిధిలోని అధికారాలను కేంద్ర ప్రభుత్వం క్రమంగా తన ఆధీనంలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. యూనివర్సిటీలపై కూడా కేంద్రం ఆధిపత్యం చలాయించాలని చూస్తోందని విమర్శించారు.
విద్య సాధ్యమైనంత వరకు రాష్ట్రాల పరిధిలోనే ఉంటే తప్పిదాలు, అక్రమాలు తగ్గుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేసి పారదర్శకంగా నియామకాలు చేపట్టామని, విద్యార్థుల్లో విశ్వాసం పెంచేలా పరీక్షల నిర్వహణ చేస్తున్నామని తెలిపారు.
గ్లోబరీనా వంటి సంస్థలపై చర్యలు తీసుకోవాలి
గతంలో గ్లోబరీనా వంటి సంస్థలు తెలంగాణలో పరీక్షల నిర్వహణలో అక్రమాలకు పాల్పడ్డాయని ఆరోపించిన సీఎం, అప్పటి ప్రభుత్వం వాటిపై చర్యలు తీసుకోకపోవడంతో ఇతర పరీక్షా వ్యవస్థలకు కూడా ఆ ప్రభావం విస్తరించిందన్నారు.
అలాంటి సంస్థలపై కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర చట్టాలకు అనుగుణంగా రాష్ట్రంలో కూడా అవసరమైన సంస్కరణలు తీసుకువస్తామని చెప్పారు.
ఫీజు రీఎంబర్స్‌మెంట్‌పై స్పష్టత
తెలంగాణలో ఫీజు రీఎంబర్స్‌మెంట్ సమస్య భవిష్యత్తులో ఉండదని సీఎం స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన సుమారు ₹8 వేల కోట్ల బకాయిలు రాష్ట్రంపై భారంగా మారాయని తెలిపారు.
ఇకపై ప్రతి విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ను అదే ఏడాదిలో చెల్లించేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో సుమారు ₹10 వేల కోట్ల ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలు ఉన్నాయని పేర్కొంటూ, ఆ అంశంపై కూడా స్పందించాలని విమర్శకులకు సూచించారు.
హైడ్రా కొనసాగుతుంది.. కోర్టు ఆదేశాలను సమీక్షిస్తాం
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను విధుల నుంచి తప్పించాలని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్పందించిన సీఎం, ప్రభుత్వం ఆ ఉత్తర్వులను సమీక్షిస్తుందని తెలిపారు.
అయితే హైడ్రా కార్యకలాపాలు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగుతాయని, సంస్థను మరింత బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు.
హైడ్రా తమ ప్రభుత్వం చేపట్టిన అత్యంత కీలక సంస్కరణల్లో ఒకటని పేర్కొన్న సీఎం, భూ ఆక్రమణదారులు నకిలీ పత్రాలతో కోర్టులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సోషల్ మీడియాలో సంస్థపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
భూ కబ్జాదారులపై కఠిన చర్యలు కొనసాగుతాయి
బతుకమ్మ కుంట, ఎన్ కన్వెన్షన్, గండిపేట చెరువు ప్రాంతాల్లో జరిగిన ఆక్రమణలను ప్రస్తావించిన రేవంత్ రెడ్డి, భూ కబ్జాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.
హైడ్రా విషయంలో ప్రభుత్వానికి పూర్తి స్పష్టత ఉందని, అధికారుల నియామకం ప్రభుత్వ విచక్షణాధికారంలో భాగమేనని పేర్కొన్నారు. కోర్టుల్లో తప్పుడు కేసులను చట్టపరంగానే ఎదుర్కొంటామని వెల్లడించారు.










