Friday 3rd July 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > అమరావతి పేరిట అవినీతి యజ్ఞం: విజయసాయిరెడ్డి!

అమరావతి పేరిట అవినీతి యజ్ఞం: విజయసాయిరెడ్డి!

vijay Sai Reddy

Vijayasai Reddy To File Case On Amaravati | ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణాల పేరిట జరుగుతున్న భారీ అవినీతిపై త్వరలోనే న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యులు వి. విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు.

అమరావతిలో సాగుతున్న అవినీతి యజ్ఞాన్ని ప్రజలందరి తరఫున ప్రశ్నిస్తూ, ప్రాజెక్టుల వ్యయం ఎస్కలేషన్‌కు (Escalation) సంబంధించిన పూర్తి నివేదికలు, పక్కా ఆధారాలతో కోర్టును ఆశ్రయించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఏపీ రాజధాని వ్యవహారంపై ఆయన తన గళాన్ని విప్పారు.

టీడీపీ, వైసీపీల వాదనలు అర్థరహితం..

రాష్ట్ర రాజధాని విషయంలో ప్రధాన రాజకీయ పార్టీలైన తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు అవలంబిస్తున్న తీరును విజయసాయిరెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి పన్నెండేళ్లు గడుస్తున్నా.. నేటికీ ఏపీ రాజధాని ఎక్కడ ఉండాలనే చర్చ సాగడం అందరూ సిగ్గుపడాల్సిన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు.

రెండు పార్టీల భిన్న వాదనలు..

ఆంధ్రప్రదేశ్ రాజధాని కేవలం ‘అమరావతి’ మాత్రమేనని టీడీపీ.. కాదు ‘మావిగన్’ (మూడు ప్రాంతాల కాన్సెప్ట్) అంటూ వైసీపీ చేస్తున్న భిన్న వాదనలు రెండూ ముమ్మాటికీ అర్థరహితమైనవని ఆయన మండిపడ్డారు.

రాజధాని వికేంద్రీకరణ మరియు అభివృద్ధిపై విజయసాయిరెడ్డి ఒక కీలక ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. రాష్ట్ర విభజన చట్టంలోనే విజయవాడ–గుంటూరు–తెనాలి–మంగళగిరి (VGTM) కాన్సెప్ట్ స్పష్టంగా ఉందని ఆయన గుర్తుచేశారు.

ఈ నాలుగు ప్రధాన నగరాల పరిధిలో విస్తృతంగా రాజధాని భవనాలను నిర్మించి విస్తరింపజేస్తే ఎవరికీ వచ్చే నష్టం ఏముందని ఆయన సూటిగా ప్రశ్నించారు.

రూ. 15 వేల కోట్ల అవినీతిపై జగన్ వైఖరిని నిలదీసిన విజయసాయి..

ప్రస్తుత అమరావతి ప్రాజెక్టుల్లో జరుగుతున్న దోపిడీని ఎండగడుతూనే, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యూహాన్ని కూడా ఆయన బహిరంగంగానే నిలదీశారు.

“అమరావతిలో సుమారు రూ. 50 వేల కోట్ల భారీ అంచనాలతో నిర్మాణాలు చేపడుతుండగా.. అందులో ఏకంగా రూ. 15 వేల కోట్ల మేర భారీ అవినీతి జరుగుతోంది.

ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నప్పుడు ఆ ప్రధానమైన అంశాన్ని వదిలేసి.. ఇంకా ‘మావిగన్’ అంటూ వైసీపీ అధినేత జగన్ పాత రాగం అందుకోవడం వల్ల ప్రజలకు వచ్చే ప్రయోజనం ఏంటి?” అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

అమరావతి అవినీతిపై రాజీలేని పోరాటం చేస్తానని, ఎస్కలేషన్ పేరిట ప్రజల సొమ్మును దోచుకుంటున్న వారిని కోర్టు బోనెక్కించేందుకే తానే స్వయంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించబోతున్నట్లు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.

You may also like
“ఎన్టీఆర్ ని కూడా రౌడీషీటర్ అనేవారేమో!”

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions