Monday 22nd June 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ఏపీ వక్ఫ్ బోర్డుకు డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు!

ఏపీ వక్ఫ్ బోర్డుకు డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు!

pawan kalyan

Pawan Kalyan Letter to Waqf Board | శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం రెహమతాబాద్ దర్గా నిర్వహణ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

దర్గా బాధ్యతల అప్పగింతపై వస్తున్న ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించిన ఆయన.. ఈ వ్యవహారంపై తక్షణమే సమగ్ర చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వక్ఫ్ బోర్డును ఆదేశించారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వక్ఫ్ బోర్డుకు అధికారిక లేఖ అందింది.

వివాదానికి కారణం ఇదే..

నెల్లూరు జిల్లా ఏ.ఎస్.పేట మండలం రెహమతాబాద్‌లోని ‘దర్గా హజ్రత్ ఖ్వాజా రెహమతుల్లా నాయబ్-ఎ-రసూల్’ నిర్వహణ బాధ్యతలను ఒక వ్యక్తికి అప్పగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు ప్రచారం సాగింది.

అయితే, సదరు వ్యక్తిపై పిల్లలపై లైంగిక దాడుల నిరోధక చట్టం.. అంటే పోక్సో (POCSO) కింద తీవ్రమైన కేసు పెండింగ్‌లో ఉంది.

ఇస్లాం ధర్మాన్ని విశ్వసించే పలువురు భక్తులు, ముస్లిం మత పెద్దలు ఈ విషయాన్ని డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. భక్తుల నుంచి అందిన వినతులు, ఫిర్యాదులను పవన్ కళ్యాణ్ క్షుణ్ణంగా పరిశీలించారు.

పిల్లలపై నేరాలకు పాల్పడేవారికి బాధ్యతలా?

ఈ వ్యవహారాన్ని అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించాలని వక్ఫ్ బోర్డుకు పవన్ కళ్యాణ్ సూచించారు. పిల్లలపై నేరాలకు పాల్పడినట్లు తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు ఇలాంటి పవిత్రమైన మతపరమైన సంస్థల పరిపాలన, నిర్వహణ బాధ్యతలను అప్పగించడం ఏమాత్రం సముచితం కాదని ఆయన స్పష్టం చేశారు.

నివేదిక ఇవ్వాలని ఆదేశం..

చట్టపరమైన అంశాలన్నింటినీ సమగ్రంగా పరిశీలించాలని.. దర్గా పవిత్రతను, ప్రతిష్ఠను, అలాగే భక్తుల నమ్మకాన్ని కాపాడేలా తగిన చర్యలు చేపట్టాలని వక్ఫ్ బోర్డుకు పంపిన లేఖలో పేర్కొన్నారు.

ఈ వివాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, తీసుకున్న చర్యలపై వీలైనంత త్వరగా నివేదిక (Report) సమర్పించాలని ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వక్ఫ్ బోర్డును ఆదేశించింది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions