Saturday 1st August 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > నీట్ రీ-ఎగ్జామ్ వేళ కేంద్రం సంచలన నిర్ణయం!

నీట్ రీ-ఎగ్జామ్ వేళ కేంద్రం సంచలన నిర్ణయం!

  • భారత్‌లో ‘టెలిగ్రామ్’పై తాత్కాలిక ఆంక్షలు!

Telegram Restricted In India NEET Re Exam | జూన్ 21న జరగబోయే నీట్-యూజీ 2026 (NEET-UG 2026) పునఃపరీక్ష నేపథ్యంలో పేపర్ లీకేజీల బెడద, తప్పుడు ప్రచారాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది.

దేశంలో ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘టెలిగ్రామ్’ (Telegram) సేవలపై తాత్కాలికంగా ఆంక్షలు విధిస్తూ కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) ఆదేశాలు జారీ చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సిఫార్సుల మేరకు ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది.

జూన్ 22 వరకు నిషేధం.. ఫీచర్లపై కోత..

పరీక్షల నిర్వహణలో పారదర్శకతను కాపాడేందుకు ఎన్‌టీఏ చేసిన సూచనలను కేంద్రం పరిగణనలోకి తీసుకుంది.  తాజా ఆదేశాల ప్రకారం.. భారతదేశంలో జూన్ 22 వరకు టెలిగ్రామ్ యాప్‌ను వినియోగించకుండా తాత్కాలిక ఆంక్షలు విధించారు.

టెలిగ్రామ్‌లోని ‘మెసేజ్ ఎడిటింగ్’ (Message-editing feature) ఆప్షన్‌ను జూన్ 30 వరకు నిలిపివేయాలని కేంద్రం సదరు ప్లాట్‌ఫామ్‌ను ఆదేశించింది. మెసేజ్ పంపిన తర్వాత కంటెంట్‌ను మార్చే ఫీచర్‌ను దుర్వినియోగం చేయకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఎడిటింగ్ ఫీచర్‌పై నిఘా ఎందుకు?

పరీక్షలు ముగిసిన తర్వాత టెలిగ్రామ్ ఛానల్ అడ్మిన్లు పాత పోస్టులను ఎడిట్ చేస్తూ, ఒరిజినల్ టైమ్‌స్టాంప్ (Timestamp) మారకుండా క్వశ్చన్ పేపర్లను అటాచ్ చేస్తున్నట్లు ఎన్‌టీఏ గుర్తించింది.

పరీక్షకు ముందే పేపర్ లీక్ అయినట్లు భ్రమలు కల్పించి, విద్యార్థులను మోసం చేసేందుకు ఈ ఫీచర్‌ను లీకేజీ ముఠాలు వాడుతున్నాయని ఏజెన్సీ స్పష్టం చేసింది.

మోసగాళ్ల నెట్‌వర్క్‌ పై ఉక్కుపాదం..

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) సహకారంతో ఇప్పటికే పలు నకిలీ టెలిగ్రామ్ ఛానళ్లు, బాట్లను తొలగించారు. బిహార్ పోలీస్ శాఖ విద్యార్థులను అప్రమత్తం చేయగా, అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ బ్రాంచ్ అంతర్రాష్ట్ర సైబర్ ముఠాను అరెస్ట్ చేసింది.

దాదాపు 1,000 మందిని కాంటాక్ట్ చేసి, రూ.1.5 కోట్ల మేర లావాదేవీలు జరిపిన ఈ ముఠా టెలిగ్రామ్ ద్వారా లక్షల రూపాయలకు పేపర్లు అమ్ముతామని మోసాలకు పాల్పడినట్లు తేలింది.

“సురక్షిత పరీక్షా విధానం వెలుపల ఎలాంటి నీట్ ప్రశ్నపత్రం ఉనికిలో లేదు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే లీకేజీల వదంతులను నమ్మి విద్యార్థులు, తల్లిదండ్రులు మోసపోవద్దు.” అని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచించింది.

You may also like
యువ జంట ఆదర్శ వివాహం.. కట్నం ఎంతో తెలుసా!
ఇంట్లోకి చొరబడిన చిరుత.. కుక్కతో పాటు లోపల వేసి తాళం వేసిన యజమాని!
సౌత్ సీఎంలే రిచ్.. ఏడీఆర్ (ADR) నివేదికలో ఆసక్తికర అంశాలు!
ఈ20 ఇంధనం వాడితే బీమా రద్దు..? క్లారిటీ ఇచ్చిన కేంద్రం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions