Saturday 23rd May 2026
12:07:03 PM
Home > తాజా > గౌడ సంఘాల విజ్ఞప్తి.. ‘తాటి కల్లు మేళా’ రద్దు!

గౌడ సంఘాల విజ్ఞప్తి.. ‘తాటి కల్లు మేళా’ రద్దు!

Ponnam Prabhakar

– వెనక్కి తగ్గిన మంత్రి పొన్నం ప్రభాకర్!

Thati Kallu Mela Cancelled | తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకున్న ‘తాటి కల్లు మేళా’ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసుకుంది.

గౌడ కుల సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, వారి మనోభావాలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారికంగా ప్రకటించారు.

ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ కుల వృత్తుల సంక్షేమానికి, గీత కార్మికుల హక్కుల రక్షణకు కట్టుబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

కల్లు అమ్మడం అనేది గీత కార్మికుల సాంప్రదాయ హక్కు అని, ఆ హక్కులకు ఎలాంటి భంగం వాటిల్లనివ్వబోమని మంత్రి హామీ ఇచ్చారు.

మేళా వెనుక దురుద్దేశం లేదు..

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ తాటి కల్లు మేళా నిర్వహించాలనుకోవడానికి గల కారణాలను వివరించారు.

గీత వృత్తి ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా మారాలని, తద్వారా గౌడ కుటుంబాలు ఆర్థికంగా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలనే మంచి ఉద్దేశంతోనే ఈ మేళా నిర్వహించాలని భావించామని, ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టం చేశారు.

కుల సంఘాల మాటే శాసనం..
అయితే, ఈ కార్యక్రమంపై గౌడ సంఘాలు వ్యక్తం చేసిన అభ్యంతరాలను, వారి విజ్ఞప్తిని మన్నిస్తూ మేళాను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. గౌడ సోదరుల ఆలోచనలకు అనుగుణంగానే ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పారు.

గీత కార్మికులకు ప్రభుత్వం పూర్తి అండ!

కుల వృత్తులను ప్రోత్సహించడంలో తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందే ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. గీత వృత్తిని మరింత లాభసాటిగా మార్చడానికి, కార్మికుల భద్రతకు సంబంధించి కుల సంఘాల నుంచి ఎలాంటి సూచనలు, సలహాలు వచ్చినా ప్రభుత్వం స్వీకరిస్తుందని తెలిపారు.

గీత కార్మికుల సంప్రదాయ హక్కులను ఎవరైనా హరించే ప్రయత్నం చేస్తే ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని, వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ గీత కార్మికుల పక్షాన నిలబడి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions