Bihar Private School Fees regulation | బీహార్‌లోని ప్రైవేట్ విద్యా సంస్థల అడ్డగోలు దోపిడీకి అడ్డుకట్ట వేసేలా ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాఠశాలల ఫీజుల పెంపు, పుస్తకాలు, యూనిఫామ్‌ల విక్రయాల్లో జరుగుతున్న మాయాజాలంపై ఆయన ఉక్కుపాదం మోపారు.
సామాన్యుల ఆర్థిక భారానికి కారణమవుతున్న ప్రైవేట్ పాఠశాలల ‘కమర్షియల్’ పోకడలపై సామాజిక మాధ్యమం ‘X’ వేదికగా సీఎం తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ప్రతి ప్రైవేట్ పాఠశాల తమ పూర్తి ఫీజుల నిర్మాణాన్ని నోటీసు బోర్డులు మరియు వెబ్‌సైట్‌లలో బహిరంగంగా ప్రదర్శించాలి.
రహస్యంగా లేదా అదనంగా ఎలాంటి ఫీజులు వసూలు చేయకూడదు. నిర్దేశించిన దుకాణాల్లోనే పుస్తకాలు, యూనిఫామ్‌లు కొనాలని తల్లిదండ్రులను బలవంతం చేయకూడదు. పాఠశాలలు సూచించిన వెండర్ల వద్దే కొనాలనే నిబంధనను సీఎం కొట్టిపారేశారు.
ఫీజులు చెల్లించలేదనే కారణంతో విద్యార్థులను పరీక్షలకు కూర్చోనివ్వకపోవడం, ఫలితాలను ఆపడం లేదా విద్యా కార్యకలాపాల నుంచి దూరం చేయడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.







