Rahul Ramakrishna X Post | తెలుగు చలనచిత్ర పరిశ్రమపై యువ నటుడు రాహుల్ రామకృష్ణ సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
“సినిమా హాళ్లు ఖాళీగా ఉన్నాయంటే అది మన పనితనం ఎంత అధ్వాన్నంగా ఉందో చెప్పడానికి ఒక నిజాయితీ గల తీర్పు” అని రాహుల్ కుండబద్దలు కొట్టారు. ప్రేక్షకులు తెలివితక్కువ వారని భావించడం మేకర్స్ మూర్ఖత్వమని ఆయన విమర్శించారు.
ఎండలు, ట్రాఫిక్, పార్కింగ్ ఛార్జీలు, పెట్రోల్ ధరలు, థియేటర్లలో తినుబండారాల రేట్లను దాటుకుని ప్రేక్షకుడు థియేటర్ కు రావాలంటే.. అతనికి ఇచ్చే కంటెంట్ అంత గొప్పగా ఉండాలని రాహుల్ గుర్తు చేశారు. ఫోన్ స్క్రీన్‌పై చూడలేని ఒక అద్భుతాన్ని చూపిస్తే తప్ప, ప్రేక్షకులు ఇంట్లో నుంచి కదలరని స్పష్టం చేశారు.
“ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో కెమెరా ఉంది, టెక్నిక్స్ అందరికీ తెలుసు. మన క్రాఫ్ట్ ఏదో అంతుచిక్కని విద్య అని విర్రవీగడం మానేయాలి. ఆడియన్స్ ను అవమానిస్తూ, మళ్ళీ వాళ్ళ దగ్గరే కృతజ్ఞత కోరుకోవడం సరికాదు” అని ఆయన హితవు పలికారు.
సినిమా ధరలకు న్యాయం చేసేలా మేకర్స్ ఆత్మపరిశీలన చేసుకోవాలని, ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించవద్దని రాహుల్ రామకృష్ణ సూచించారు.







