- ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం విజ్ఞప్తి
- డిమాండ్లకు ప్రభుత్వం ‘గ్రీన్ సిగ్నల్’!
Ponnam Prabhakar RTC strike request | తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజుకు చేరిన తరుణంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం సచివాలయం నుండి కార్మికులకు కీలక విజ్ఞప్తి చేశారు.
సమ్మె వల్ల నిత్యం ప్రయాణించే 65 లక్షల మంది ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సంస్థ ప్రయోజనాల దృష్ట్యా తక్షణమే సమ్మె విరమించాలని కోరారు.
32లో 29 డిమాండ్లకు ఓకే: ఆర్టీసీ జేఏసీ (JAC) లేవనెత్తిన 32 ప్రధాన అంశాలలో 29 అంశాల పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించిందని మంత్రి తెలిపారు. వీటన్నింటినీ తక్షణమే అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
కేవలం ఆర్టీసీ విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికలు అనే రెండు అంశాలు మాత్రమే సాంకేతిక కారణాల వల్ల పెండింగ్‌లో ఉన్నాయని ఆయన వివరించారు.
ఈ అంశాలపై అధ్యయనం చేసేందుకు నలుగురు సీనియర్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామని, 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించామని పేర్కొన్నారు.
“కమిటీల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని అనడం తప్పు. 41 రోజులు ఓపిక పట్టిన వారు, మరో 4 వారాలు వేచి చూడలేరా?” అని ఆయన ప్రశ్నించారు.
జేఏసీ నాయకులు ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు తెలియజేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావచ్చని, కానీ సాధారణ కార్మికులు మాత్రం ప్రజలకు ఇబ్బంది కలగకుండా విధుల్లో చేరాలని మంత్రి కోరారు.
ఈ సందర్భంగా ఆర్టీసీ సమ్మె వెనుక మాజీ మంత్రి హరీష్ రావు ప్రమేయం ఉందని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.
సమ్మె దృష్ట్యా ప్రభుత్వం అద్దె బస్సులు, ప్రైవేట్ డ్రైవర్లతో రవాణా వ్యవస్థను నడిపించే ప్రయత్నం చేస్తోంది. ప్రయాణికుల అవసరాల కోసం మెట్రో మరియు ఇతర రవాణా మార్గాలను కూడా సమన్వయం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.






