Thursday 8th October 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > అరుణాచల్ సీఎం పెమా ఖండూకు సుప్రీం షాక్!

అరుణాచల్ సీఎం పెమా ఖండూకు సుప్రీం షాక్!

Pema Khandu
  • రూ.1,270 కోట్ల కాంట్రాక్టుల కుంభకోణంపై సీబీఐ విచారణకు ఆదేశం!

Supreme Court CBI probe Pema Khandu | అరుణాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. ముఖ్యమంత్రి పెమా ఖండూపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో సీబీఐ (CBI) ప్రాథమిక విచారణకు సుప్రీంకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది.

తన అధికార దుర్వినియోగానికి పాల్పడి, తన కుటుంబ సభ్యులకు చెందిన సంస్థలకు భారీగా ప్రభుత్వ కాంట్రాక్టులు కట్టబెట్టారనే ఆరోపణలపై విచారణ జరపాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

కేసు నేపథ్యం ఇదీ..
‘సేవ్ మోన్ రీజియన్ ఫెడరేషన్’ మరియు ‘వాలంటరీ అరుణాచల్ సేన’ అనే స్వచ్ఛంద సంస్థలు దాఖలు చేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ (PIL)పై సుప్రీంకోర్టు ఈ విచారణ జరిపింది.

ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పిటిషనర్ల తరఫున వాదనలు వినిపిస్తూ.. 2015 జనవరి 1 నుండి 2025 డిసెంబర్ 31 వరకు సుమారు రూ. 1,270 కోట్ల విలువైన ప్రభుత్వ పనులను సీఎం తన కుటుంబ సభ్యుల కంపెనీలకు ధారాదత్తం చేశారని ఆరోపించారు.

ముఖ్యంగా సీఎం భార్య రించిన్ డ్రెమాకు చెందిన ‘బ్రాండ్ ఈగల్స్’ సంస్థతో పాటు ఇతర బంధువుల సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా కాంట్రాక్టులు వెళ్లాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవే..

  • సీబీఐ ఈ కేసులో రెండు వారాల్లోగా ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించాలి.
  • అరుణాచల్ ప్రభుత్వ పనులు, కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్లు మరియు నిధుల మళ్లింపుపై సమగ్ర విచారణ జరపాలి.
  • దర్యాప్తు పూర్తి చేసి 16 వారాల్లోగా సీబీఐ తన నివేదికను కోర్టుకు సమర్పించాలి.
  • అరుణాచల్ ప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ఒక నోడల్ అధికారిని నియమించి, నాలుగు వారాల్లోగా అన్ని రికార్డులను సీబీఐకి అందజేయాలి.
  • కేసుతో సంబంధం ఉన్న ఎటువంటి రికార్డులు ధ్వంసం కాకుండా అత్యంత భద్రంగా ఉంచాలని కోర్టు నొక్కిచెప్పింది.

ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తిపైనే నేరుగా సీబీఐ విచారణకు ఆదేశాలు రావడం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

విచారణ నివేదిక వచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం సీబీఐకి పూర్తి స్థాయిలో సహకరించాలని కోర్టు ఆదేశించడంతో, ఈ కేసు మున్ముందు మరెన్ని మలుపులు తిరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

You may also like
“మోదీ నాయకత్వమే దేశానికి దిశానిర్దేశం”: చంద్రబాబు
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఘాటు వ్యాఖ్యలు!
వేదికపై రాహుల్ గాంధీని ముద్దు పెట్టుకున్న యువతి..!
ఢిల్లీ చాలా ప్రమాదకరమైన ప్రదేశం.. జాగ్రత్త: మోదీ

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions