Telangana HAM Roads Project | తెలంగాణ రాష్ట్రంలోని మారుమూల గ్రామం నుండి రాజధాని వరకు రహదారుల నెట్‌వర్క్ ను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) పద్ధతిలో రాష్ట్ర రోడ్లకు మహర్దశ పట్టనుందని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శాసనసభ వేదికగా ప్రకటించారు.
వచ్చే రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా సింగిల్, డబుల్ మరియు ఫోర్ లేన్ రోడ్లను ఆదర్శవంతంగా నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు. మొత్తం 20 వేల కోట్లతో ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు సౌకర్యం కల్పించనున్నట్లు వెల్లడించారు.
మొదటి విడతలో భాగంగా ₹13,006 కోట్లతో 6092.37 కిలోమీటర్ల మేర ఆర్ అండ్ బి (R&B) రోడ్ల పనులను చేపట్టారు. ఇందులో మొత్తం 34 ప్యాకేజీల కింద 441 పనులు జరగనున్నాయి.
ఇప్పటికే 24 ప్యాకేజీలకు టెండర్లు పూర్తయ్యాయని, మిగిలిన 10 ప్యాకేజీలకు వారం రోజుల్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులను కేటాయిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
ఈ ప్రాజెక్టు ద్వారా గ్రామాలు, మండలాలు, జిల్లా కేంద్రాలు మరియు రాజధాని హైదరాబాద్ మధ్య రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని మంత్రి పేర్కొన్నారు.
మెరుగైన రహదారుల వల్ల రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు ఆర్థికాభివృద్ధి వేగవంతమవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులో జాప్యం జరగకుండా, పారదర్శకత పెంచేందుకు ప్రభుత్వం ‘డైరెక్ట్ డెబిట్ మెకానిజం’ ను అమలు చేస్తోంది. దీనివల్ల నిధుల చెల్లింపులో విశ్వసనీయత పెరిగి, పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతాయి.









