Sunday 20th September 2026
12:07:03 PM
Home > తాజా > “పాండవుల సంపాదన కౌరవుల తద్దినానికే సరిపోయింది”

“పాండవుల సంపాదన కౌరవుల తద్దినానికే సరిపోయింది”

mla seethakka
  • అసెంబ్లీలో హరీశ్ రావుకు సీతక్క ఘాటు కౌంటర్!

Seethakka Counter To Harish Rao | తెలంగాణ అసెంబ్లీ వేదికగా మాజీ మంత్రి హరీశ్ రావు మరియు మంత్రి సీతక్క మధ్య మాటల యుద్ధం సాగింది.

గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై సీతక్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారు? ఎన్ని ఉద్యోగాలిచ్చారు?” అని ప్రశ్నిస్తూ, ప్రస్తుత ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని ఒక సామెతతో పోల్చి సభలో చర్చకు తెరలేపారు.

“పాండవులు సంపాదించింది అంతా కౌరవుల తద్దినానికే సరిపోయిందన్నట్లుగా ఉంది మా ప్రభుత్వ పరిస్థితి. గత ప్రభుత్వం చేసిన లక్షల కోట్ల అప్పులకు వడ్డీలు, పాత బిల్లుల బకాయిలు చెల్లించేందుకే మా సంపాదన అంతా సరిపోతోంది” అని సీతక్క ఎద్దేవా చేశారు.

హరీశ్ రావు నియోజకవర్గంలో 50% రుణమాఫీ కాలేదన్న విమర్శపై స్పందిస్తూ.. “మీరు పదేళ్లలో ఎందుకు పూర్తి చేయలేదు? అప్పుడే చేసి ఉంటే ఇప్పుడు మాకు ఈ ఇబ్బంది ఉండేది కాదు కదా! మీ హయాంలో ఎంతో మంది రైతులు చనిపోయారు, దానికి సమాధానం చెప్పండి” అని నిలదీశారు.

కేవలం నోటిఫికేషన్లు ఇస్తే ఉద్యోగాలు ఇచ్చినట్లు కాదని, తమ ప్రభుత్వం బాధ్యతాయుతంగా నియామకాలు చేపడుతోందని స్పష్టం చేశారు. ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల జీవిత బీమా కల్పిస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని మండిపడ్డారు. రాజకీయాల కోసం మట్టి, దుమ్ము పోసే పనులు మానుకోవాలని హరీశ్ రావుకు సూచించారు.

“హరీశ్ అన్నా.. మీ బాధ అంతా అధికారం పోయిందనే తప్ప ప్రజల కోసం కాదు. సీటు మారినంత మాత్రాన మీ పదేళ్ల చరిత్ర మారిపోదు. ముందు మీరు ఏం చేశారో లెక్కలతో సహా చెప్పి, ఆ తర్వాత మాకు సలహాలు ఇవ్వండి” అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఆర్థిక వెసులుబాటును బట్టి తాము ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని, ప్రజల పక్షాన తమ ప్రభుత్వం నిలబడుతుందని సీతక్క పునరుద్ఘాటించారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions