MLA Palla Rajeshwar Reddy On Kavitha Suspension | భారత రాష్ట్ర సమితి నుంచి కవితను సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే.
ఈ నేపథ్యంలో బీఆరెస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి స్పందించారు. పార్టీ కార్యకర్తల నిర్ణయం, పార్టీ శ్రేయస్సు దృష్యా కవితను సస్పెండ్ చేసినట్లు వివరించారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కవిత వ్యాఖ్యల వెనుక కాంగ్రెస్ పార్టీ ఉందని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబాన్ని చీల్చాలని కాంగ్రెస్ కుట్ర చేసిందని, ప్రాంతీయ పార్టీలను చీల్చి వారి కుటుంబాలలో చిచ్చు పెట్టడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని మండిపడ్డారు.
కర్ణాటక, తమిళనాడులో కూడా కాంగ్రెస్ పార్టీ ఇదే చేసిందన్నారు. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ మాటలకు కవిత లొంగిపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కవిత సస్పెండ్ ను స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. కవిత సస్పెండ్ బాధాకరమే అయినా, కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని తాను కూడా స్వాగతిస్తున్నట్లు స్పష్టం చేశారు.










