TMC MP questions PM Modi’s silence on US claim of brokering India-Pak ceasefire | త్రినముల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ లోకసభ లో ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ముందు నిల్చున్న మరుక్షణమే ప్రధాని మోదీ యొక్క ఎత్తు ఐదు ఫీట్లు తగ్గుతుందని, సాధారణంగా 56 ఇంచుల ఎత్తు ఉండే మోదీ ఛాతీ ట్రంప్ ముందు మాత్రం 36 ఇంచులకు తగ్గుతుందని విమర్శించారు.
‘ఆపరేషన్ సింధూర్’ పై సోమవారం లోకసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా కళ్యాణ్ బెనర్జీ మాట్లాడుతూ..ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అయితే తన మధ్యవర్తిత్వం మూలంగానే ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్ అందరికంటే ముందు ప్రకటించిన విషయాన్ని కళ్యాణ్ బెనర్జీ ప్రస్తావించారు.
కానీ ప్రధాని మోదీ ట్రంప్ వ్యాఖ్యల్ని ఖండిస్తూ సోషల్ మీడియాలో ఒక్క పోస్టు కూడా చేయలేదని నిలదీశారు. ట్రంప్ వ్యాఖ్యలు తప్పు అని చెప్పడానికి ప్రధాని ఎందుకు సంకోచిస్తున్నారని ప్రశ్నించారు.
ట్రంప్ అంటే మోదీకి ఎందుకంత భయమని అడిగారు. ఇదే సమయంలో ట్రంప్ ముందు నిల్చుంటే మోదీ ఎత్తు ఐదు ఫీట్లకు తగ్గుతుందని, ఆయన ఛాతీ 56 ఇంచుల నుంచి 36 ఇంచులకు తగ్గిపోతుందని ఎద్దేవా చేశారు.








