West Indies cricketer accused of sexual assault | తమను ఆ స్టార్ క్రికెటర్ లైంగికంగా వేధించాడని, అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ పలువురు యువతులు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.
ప్రస్తుతం వెస్ట్ ఇండీస్ క్రికెట్ జట్టు తరఫున ఆడుతున్న క్రికెటర్ పై యువతులు ఆరోపణలు చేశారు. తొలుత ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఆ తర్వాత మరికొంతమంది యువతులు ఫిర్యాదు చేయడానికి ముందుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఉదంతం వెస్ట్ ఇండీస్ క్రికెట్ ను కుదిపేస్తుంది.
మార్చి 3, 2023 న బెర్బైస్ లోని న్యూ అమ్స్టరడామ్ లోని ఓ నివాసంలో తనపై అత్యాచారం చేసినట్లు ఒక యువతి గయానా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటన సమయంలో తన వయసు 18 ఏళ్ళని పేర్కొంది. అయితే సదరు క్రికెటర్ తమ కుటుంబానికి తెలుసని, పని ప్రదేశానికి వచ్చి తనని తీసుకెళ్లి ఆ తర్వాత అత్యాచారం చేసినట్లు యువతి మరియు ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు.
అనంతరం మరి కొంతమంది యువతులు క్రికెటర్ పై ఇలాంటి ఆరోపణలే చేస్తూ ఫిర్యాదు చేయడానికి ముందుకువచ్చారు. అక్కడి స్థానిక మీడియా మొదట ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా తో వెస్ట్ ఇండీస్ టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఈ సమయంలో ఆరోపణలు వచ్చాయి.
అయితే ఆరోపణలపై వెస్ట్ ఇండీస్ క్రికెట్ బోర్డు స్పందించింది. ఫిర్యాదు చేసిన విషయం తమకు తెలీదని, ఇప్పుడే దీనిపై ఏమీ మాట్లాడలేమని వెస్ట్ ఇండీస్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ కిషోర్ షాలో పేర్కొన్నారు.










