Interesting Facts About India | విశ్వగురువుగా గుర్తింపు పొందుతున్న మన భారతదేశాన్ని వివిధ పేర్లతో పిలుస్తామన్న విషయం తెలిసిందే.
ప్రాచీన కాలంలో ఈ భారత భూభాగానికి అనేక రకాల పేర్లు ఉన్నాయి. జంబూద్వీపం, భరతఖండం, హిమవర్షం, ఆర్యవర్ష్, భారతవర్ష్, హిందూ, హిందుస్థాన్, ఇండియా అనే పేర్లతో పిలిచేవారు. భరతుడు పాలించిన దేశం కాబట్టి భారత దేశం అనే పేరు వచ్చినట్లు చెప్పుకొంటారు.
పూర్వం మన ప్రాంతంలో నేరేడు పండ్ల చెట్లు విరివిగా ఉండేవట. నేరేడు పండును సంస్కృతంలో జంబూ అని పిలుస్తారు. అలా నేరేడు పండ్లు ఎక్కువగా ఉండే ప్రాంతం కాబట్టి మన దేశానికి జంబూ ద్వీపం అనే పేరు వచ్చినట్లు ప్రాచుర్యంలో ఉంది. సింధూ నదిని గ్రీకులు ఇండస్ అని పిలిచేవారు.
ఆ ఇండస్ నదీ పరీవాహక ప్రాంతంలో ఉండటంతో ఇండియా అని పిలిచారు. అలాగే అరబ్బులు హిందుస్తాన్ అని పిలిచేవారు. అయితే ఇవన్నీ కాకుండా ప్రాచీన కాలంలో జపనీయులు మన దేశాన్ని తెంజికు(Tenjiku) అనే పేరుతో పిలిచేవారు.
ఈ పదానికి అర్థం లాండ్ ఆఫ్ హెవెన్ (Land Of Heven) అంటే భూతల స్వర్గం అని అర్థం. ఈ జపాన్ పదం చైనీయుల భాషలోని టియాన్జు అనే పదం నుంచి ఉద్భవించింది. ఈ టియాన్జు అనే పదానికి కూడా భూలోక స్వర్గం అనే అర్థం.











