Wednesday 2nd September 2026
12:07:03 PM
Home > తాజా > నిరుద్యోగులకు అదిరిపోయే తీపి కబురు!

నిరుద్యోగులకు అదిరిపోయే తీపి కబురు!

  • జూన్‌లోనే ఐదారు టీజీపీఎస్‌సీ నోటిఫికేషన్లు..
  • పరీక్షల నిర్వహణలో బుర్రా వెంకటేశం విప్లవాత్మక సంస్కరణలు!

TGPSC Upcoming Notifications June | తెలంగాణలోని ఉద్యోగార్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) బంపర్ ఆఫర్ ప్రకటించింది. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మరింత వేగవంతం చేయడంతో పాటు, పరీక్షల నిర్వహణలో లీకేజీలకు తావులేకుండా విప్లవాత్మక సంస్కరణలకు సిద్ధమైంది.

సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీజీపీఎస్‌సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం రాబోయే నోటిఫికేషన్లు, ఖాళీలు మరియు సరికొత్త పరీక్షా విధానానికి సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు.

3,800 పోస్టులకు గ్రీన్ సిగ్నల్..
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కానుకగా నిరుద్యోగులకు వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లు అందించేందుకు కమిషన్ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఒకేసారి మూడు నోటిఫికేషన్లను విడుదల చేయనున్నట్లు ఛైర్మన్ ప్రకటించారు.

అంతేకాకుండా, ఈ జూన్ నెలలోనే మొత్తం ఐదు లేదా ఆరు నోటిఫికేషన్లను నిరుద్యోగుల ముందుకు తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 3,800 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఇప్పటికే అనుమతులు మంజూరు చేసిందని బుర్రా వెంకటేశం వెల్లడించారు.

ఇందులో భాగంగానే అత్యధికంగా 1,393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించామన్నారు. ప్రస్తుతానికి 28 రకాల ఉద్యోగాల్లో ఒక్కో ఖాళీ చొప్పున, మరో 25 రకాల పోస్టులలో ఐదు లోపు ఖాళీలు ఉన్నాయని, వీటన్నింటినీ భర్తీ చేస్తామని చెప్పారు.

ఇకపై ప్రతి నెలా క్రమం తప్పకుండా రెండు లేదా మూడు నోటిఫికేషన్లు విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఓఎంఆర్ (OMR) విధానానికి గుడ్ బై..
 పరీక్షల పారదర్శకతను పెంచేందుకు కమిషన్ అత్యంత కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. సాంప్రదాయకంగా వస్తున్న ఓఎంఆర్ (OMR) షీట్ల విధానంలో పరీక్షలను పక్కాగా నిర్వహించడం ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత క్లిష్టంగా మారిందని ఛైర్మన్ అభిప్రాయపడ్డారు.

లీకేజీలు, అవకతవకలకు ఆస్కారం లేకుండా ఉండాలంటే సాంకేతికతను వాడుకోవడమే ఉత్తమ మార్గమన్నారు.  పరీక్షల నిర్వహణలో అనేక సంస్కరణలు తీసుకువస్తున్నామని, ఇందులో భాగంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) విధానమే అన్నింటికంటే సురక్షితమైనదని కమిషన్ భావిస్తోంది.

అందుకే భవిష్యత్తులో టీజీపీఎస్‌సీ నిర్వహించబోయే పరీక్షలన్నింటినీ గరిష్టంగా సీబీటీ (CBT) విధానంలోనే నిర్వహించేలా అడుగులు వేస్తున్నట్లు బుర్రా వెంకటేశం స్పష్టం చేశారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions