హైదరాబాద్: ఏదైనా వెహికల్ కొనేముందు పదిచోట్ల దాని ధర, ఇతరత్రా ఫీచర్లు, విశేషాలు, ఆఫర్లు తెలుసుకోవడం మంచిది. మీ బ్యాంక్ మీకిచ్చిన ప్రీ ఆఫర్ కాకుండా, ఇతర బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల్లో వాహన రుణాలు ఏ వడ్డీరేట్లకు ఇస్తున్నారో తప్పక కనుక్కోండి.
బ్యాంక్ వడ్డీరేటు(శాతంలో)
ఎస్బీఐ 3-7.10
హెచ్‌డీఎఫ్‌సీ 3-7.25
ఐసీఐసీఐ 3-7.10
ఐడీబీఐ 3-6.75
కొటక్ మహీంద్రా 2.75-7.20
బీవోబీ 3-7.05
కెనరా 4-7.25
ముఖ్యంగా చూడాల్సిన మూడు పాయింట్లు ఏమిటి?
ఇయర్ ఎండ్ ఆఫర్లు టెంప్టింగ్‌గా ఉంటాయి.పాత కారును అమ్మేసి కొత్తది కొనేందుకు కూడా చాలా ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, డిస్కౌంట్లు కనిపిస్తుంటాయి మరి.
దీంతో కొనుగోలుదారులు సైతం ఈ పండుగ సీజన్‌కు వాహన లక్ష్మిని ఇంటికి తెచ్చుకోవాలని చూస్తూంటారు. అయితే ఈ మూడు అంశాలను పరిగణనలోకి తీసుకుని ఓ నిర్ణయానికి రావడం ఉత్తమం.
వడ్డీరేట్లపై కన్నేయండి
ఏదైనా వెహికల్ కొనేముందు పదిచోట్ల దాని ధర, ఇతరత్రా ఫీచర్లు, విశేషాలు, ఆఫర్లు తెలుసుకోవడం మంచిది. మీ బ్యాంక్ మీకిచ్చిన ప్రీ ఆఫర్ కాకుండా, ఇతర బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల్లో వాహన రుణాలు ఏ వడ్డీరేట్లకు ఇస్తున్నారో తప్పక కనుక్కోండి. క్రెడిట్ స్కోర్ బాగుంటే అతి తక్కువ ఇంట్రెస్ట్‌కు రుణాలు లభిస్తున్న కాలమిది. కాస్త ఓపిగ్గా వెతికితే 1-2 శాతం తక్కువకు లోన్ దొరుకుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సాధారణంగా తక్కువ వడ్డీకి లోన్ ఇచ్చేవాళ్ల దగ్గర నిబంధనలు కఠినతరంగా ఉంటాయి. అదే ఇంకొన్ని సంస్థలు ఉదారంగా రుణాలు ఇచ్చినప్పటికీ బయటి మార్కెట్‌తో పోల్చితే 2-5 శాతం వరకూ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగా ఉంటుంది. అయితే మీ దగ్గర పక్కా డాక్యుమెంటేషన్, మీకు ఆకర్షణీయమైన వేతనం, మీరు పెద్ద కంపెనీలో పని చేస్తూంటే మాత్రం మొహమాటం లేకుండా బేరాలాడండి. ఇదే మీ వడ్డీ భారాన్ని బాగా తగ్గిస్తుంది.
డౌన్ పేమెంట్ ఎంత?
అత్యధికులు ఆటో లోన్లపైనే ఆధారపడి కొంటూంటారు. కాబట్టి డౌన్ పేమెంట్ గురించి ఆలోచించాలి. వాహన విలువలో బ్యాంకులు 90 శాతం వరకూ లోన్ ఇస్తున్నాయ్ కదా అని తీసుకుంటే ఆ భారాన్ని మనమే మోయాలి. అందుకే 5, 10 శాతం డౌన్ పేమెంట్ కోసం చూసుకోకుండా కనీసం 20 శాతానికి తక్కువ లేకుండా డౌన్ పేమెంట్ కెపాసీటీ ఉన్నప్పుడే కారు తీసుకోవడం ఉత్తమం. ఇక్కడే మీరు 20/04/10 రూల్ పాటించాలి. ఈ రూల్ ప్రకారం కనీసం 20 శాతం డౌన్ పేమెంట్, గరిష్ఠంగా 4 ఏండ్లలో లోన్ క్లియరెన్స్, మీ నెలవారీ వేతనాల్లో ఈఎంఐ 10 శాతానికి మించకుండా చూసుకోవడం వంటివి ప్రధానం. ఇదో బేసిక్ పర్సనల్ ఫైనాన్స్ థంబ్ రూల్.
రుణ కాలపరిమితి
కారు ఎప్పటికైనా డిప్రిషియేటింగ్ అసెట్. దీని విలువ రోజులు గడిచేకొద్దీ తగ్గేదే కానీ పెరిగేది కాదు. వాళ్లు ఇస్తున్నారు కదా అని తీసుకోవడం కాకుండా, సాధ్యమైనంత త్వరగా లోన్ క్లియర్ చేసుకోండి. మొదటగా డౌన్ పేమెంట్ ఎక్కువ చేయండి. తర్వాత రుణ కాలపరిమితి కూడా ఆరేడేండ్లు కాకుండా గరిష్ఠంగా నాలుగైదేండ్లకే పరిమితం చేసుకోండి. ఉదాహరణకు మీరు రూ.10 లక్షలకు కారు తీసుకుని, లక్ష డౌన్ పేమెంట్ చేశారనుకుందాం. ఇప్పుడు రూ.9 లక్షల లోన్‌ను ఐదేండ్ల కాలపరిమితికి తీసుకుంటే నెలనెలా ఈఎంఐ రూ.18,249. చివరకు రూ.1,94,925 వడ్డీ రూపంలో అధికంగా కట్టాలి. అదే డౌన్ పేమెంట్ రూ.2 లక్షలు చేస్తే ఈఎంఐ రూ.16,221కి తగ్గుతుంది. వడ్డీ భారం రూ.1,73,267. ఇక్కడే మీకు రూ.21వేలు ఆదా కనిపిస్తోంది.
చివరగా..
కారును ఓ హోదాగా కాకుండా దాని అవసరం మీకెంత? అని ఆలోచించి ముందుకెళ్లడం మంచిది. అలాగే పెట్రో ఆధారిత వాహనాల కంటే విద్యుత్తు ఆధారిత వాహనాలు కొనడం వల్ల చేకూరే ప్రయోజనాన్నీ లెక్కించి ఓ నిర్ణయానికి రండి. కొత్త కార్లనేగాక, సెకండ్ హ్యాండ్ కార్లనూ ఓ లుక్కేయండి. కారు బాగుండి, ధర తక్కువగా ఉంటే కొనడానికి ట్రై చేయండి. మీకు స్థోమత ఉంటే, నెలవారీ బడ్జెట్ అనుకూలిస్తే.. కారు అప్పును వీలైనంత త్వరగా తీర్చేయండి.
-నాగేంద్రసాయి కుందవరం
ఎఫ్‌డీలపై బ్యాంకుల్లో వడ్డీ
బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలనుకుంటున్నారా..అయితే ఏయే బ్యాంకుల్లో ఎంత వడ్డీని ఇస్తున్నాయో మీకు తెలుసా. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు ఇటీవలకాలంలో డిపాజిట్‌దారులను ఆకట్టుకోవడానికి అత్యధిక వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ 3-7.10 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తుండగా, మిగతా బ్యాంకులు, ఆర్థిక సేవల సంస్థలు కూడా ఇదే స్థాయిలో ఇస్తున్నాయి. రిటైల్ టర్మ్ డిపాజిట్ల కంటే సీనియర్ సిటిజన్లకు మాత్రం అర శాతం వరకు అధిక వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి.