Delimitation Of Loksabha Constituencies
‘మన రాష్ట్రంలో కొత్తగా పెళ్లైన దంపతులు అత్యవసరంగా పిల్లల్ని కనండి. వారికి మంచి తమిళ్ పేర్లు పెట్టండి. సంతాన విషయంలో దంపతులు కాస్త సమయం తీసుకోవాలని గతంలో నేనే సూచించా. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. నియోజకవర్గాల పునర్విభజన అనే కత్తి వేలాడుతోంది’
సాక్ష్యాత్తు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా ప్రజలను ఉద్దేశించి చేసిన విజ్ఞప్తి ఇది. సోమవారం తమిళనాడులోని నాగపట్నంలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నూతన దంపతులు వీలైనంత త్వరగానే పిల్లల్ని కనాలని సూచించారు.
ఏకంగా సీఎం ఇలాంటి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం తమిళనాడులోనే కాదా దక్షిణాది రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయనే కాదు గతంలో ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కూడా యువతను సరైన సమయంలో పెళ్లిళ్లు చేసుకొని ఎక్కువమంది పిల్లల్ని కనాలని రిక్వెస్ట్ చేశారు.
ఇలా సీఎం స్థాయి వ్యక్తులు నేటి యువతను పిల్లల్ని కనండి అని రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది. అసలు పిల్లల్ని కనడానికి, నియోజకవర్గ పునర్విభజన అంశానికి సంబంధం ఏంటి? అందులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అని నేతలు ఎందుకు చెబుతున్నారు ఒక్కసారి తెలుసుకుందాం.
మనదేశంలో ప్రస్తుతం 543 లోక్ సభ నియోజకవర్గాలు, 245 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. ఇందులో దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో 129 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. అయితే ఈ నియోజకవర్గాలన్నీ జనాభా ప్రాతిపదికన ఏర్పడ్డాయి. మళ్లీ 2026లో దేశవ్యాప్తంగా లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన చేయనున్నారు. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
అయితే దీనిపై దక్షిణాది రాష్ట్రాలు ఈ అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 2026లో జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని, దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో దోహద పడుతున్న తమకు రాజకీయంగా ఈ డిలిమిటేషన్ అనేది పెను ప్రమాదాన్ని తీసుకువస్తుందని దక్షిణాది నేతల వాదన.
ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ నియోజకవర్గ పునర్విభజన అంశంపై గత కొద్ది రోజులుగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే అత్యవసరంగా పిల్లల్ని కనండి అని విజ్ఞప్తి చేశారు. గతంలో కూడా ఆయన కొత్తగా పెళ్ళైన జంటలు 16 మంది పిల్లల్ని కనాలని స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు చేశారు.
నియోజకవర్గాల పునర్విభజన అంశం రాష్ట్రాల జనాభాతో ముడిపడి ఉంది. కేంద్రం నుండి అన్ని రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో కూడా జనాభా అనేది కీలకం. ఫైనాన్స్ కమిషన్ సూత్రం ప్రకారం రాష్ట్రాల జనాభాకు కూడా నిధుల కేటాయింపులో 15 శాతం వెయిటేజ్ ఉంటుంది. అలాగే లోకసభ నియోజకవర్గాలు కూడా జనాభా ప్రాతిపదికనే నిర్ణయిస్తారు.
జనాభా అనేది నిధులకు, నియోజకవర్గాలకు ప్రాతిపదిక. అయితే 1971 తర్వాత జనాభా నియంత్రణ కోసం దక్షిణాది రాష్ట్రాలు కృషి చేశాయి. కానీ, జనాభాను నియంత్రించినందుకు తమను శిక్షించడం సరికాదని దక్షిణాది రాష్ట్రాలు చెప్పడంతో మొన్నటి వరకు నియజకవర్గాల పునర్విభజనకు 1971 జనాభా లెక్కలనే ప్రాతిపదికగా తీసుకున్నారు. కానీ, 2026లో జరగబోయే పునర్విభజనకు మాత్రం 2025లో నిర్వహించబోయే జనాభా లెక్కలను ప్రాతిపదికగా కేంద్రం తీసుకోనుంది.
ఈ నేపథ్యంలో జాతీయ లక్ష్యంలో భాగంగా జనాభాను నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలను ఇప్పుడు శిక్షించడం ఏంటని నేతలు కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో దక్షిణాది రాష్ట్రాల పట్ల చిన్న చూపు ఉందని, ఒకవేళ 2025 జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజన జరిగితే ఇది మరింత వివక్షకు దారి తీసే ప్రమాదం ఉందని తమిళనాడులోని అధికార డీఎంకే నేతలు ఆందోళన చెందుతున్నారు.
2026 లో జరగబోయే పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాల్లోని లోకసభ నియోజకవర్గాల గణనీయంగా తగ్గుతాయని, కానీ ఈ అంశాన్ని దాచేందుకు అన్ని రాష్ట్రాల్లో సీట్లను పెంచుతున్నారని నేతలు చెబుతున్నారు. పైకి నియోజకవర్గాల సంఖ్య పెరిగినా, లోకసభలో దక్షిణాది రాష్ట్రాల సీట్ల షేర్ మాత్రం తగ్గుతుందని ఆరోపిస్తున్నారు.
ఇదే జరిగితే ఉత్తరాదిలో ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీ ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, అప్పుడు వారు దక్షిణాది ప్రజల సమస్యలను ఎలా పట్టించుకుంటారని సౌత్ లీడర్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ అనుమానాల నేపథ్యంలోనే సీఎం స్టాలిన్ కేంద్రంపై విమర్శలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే పిల్లల్ని ఎక్కువ కనాలని సూచనలు చేస్తున్నారు.
మరోవైపు నియోజకవర్గాల పునర్విభజన ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగబోదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భరోసా ఇచ్చారు. కేవలం రాజకీయంగా ప్రయోజనం పొందేందుకే కొన్ని పార్టీలు పునర్విభజన పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయని అమిత్ షా మండిపడ్డారు.