సుసంపన్నమైన భారతదేశాన్ని నిర్మించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం దేశ ప్రజల ముందు తొమ్మిది కీలక ప్రతిజ్ఞలను ఉంచారు.
మాండ్యాలోని ఆదిచుంచనగిరి మహాసంస్థాన మఠంలో ‘శ్రీ గురు భైరవైక్య మందిరాన్ని’ ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన ఈ పిలుపునిచ్చారు.
ప్రధాని కోరిన ఆ ‘తొమ్మిది’ ప్రతిజ్ఞలు ఇవే:
- జల సంరక్షణ: ప్రతి నీటి చుక్కను పొదుపు చేయాలి. మెరుగైన నీటి యాజమాన్య పద్ధతులను పాటించాలి.
- ఏక్ పేడ్ మా కే నామ్: ‘అమ్మ పేరుతో ఒక మొక్క’ ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి ప్రకృతిని కాపాడాలి.
- పరిశుభ్రత: బహిరంగ ప్రదేశాలతో పాటు, ముఖ్యంగా పుణ్యక్షేత్రాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
- ఓకల్ ఫర్ లోకల్: స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇచ్చి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలి.
- స్వదేశీ పర్యటన: విదేశీ పర్యటనల కంటే ముందు మన దేశంలోని పర్యాటక ప్రాంతాలను దర్శించి ప్రోత్సహించాలి.
- ప్రకృతి వ్యవసాయం: రసాయన రహిత సాగును అవలంబించి ఆరోగ్యకరమైన భూమిని భవిష్యత్తు తరాలకు అందించాలి.
- చిరుధాన్యాల వినియోగం: ఆహారంలో మిల్లెట్స్ (శ్రీ అన్న)ను భాగంగా చేసుకోవాలి. నూనె వాడకాన్ని తగ్గించాలి.
- యోగా & ఫిట్‌నెస్: శారీరక, మానసిక దృఢత్వం కోసం యోగాను నిత్యకృత్యం చేసుకోవాలి.
- సేవా గుణం: సాటి మనిషికి సహాయపడే సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలి.
‘ఈ తొమ్మిది ప్రతిజ్ఞలను మనం నిజాయితీతో పాటిస్తే, అభివృద్ధి చెందిన కర్ణాటకను, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని అత్యంత వేగంగా సాకారం చేసుకోవచ్చు” అని ప్రధాని పేర్కొన్నారు. ఆదిచుంచనగిరి మఠం మాజీ పీఠాధిపతి శ్రీ బాలగంగాధరనాథ స్వామి చేసిన సామాజిక సేవలను ఈ సందర్భంగా మోదీ కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ, కేంద్ర మంత్రులు హెచ్‌డి కుమారస్వామి, శోభా కరంద్లాజే తదితరులు పాల్గొన్నారు.






