KTR Emotional On Bonding’s | నేటి యాంత్రిక జీవనంలో బంధాలకు అర్థం మారిపోతున్న తరుణంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యువతకు ఒక విలువైన సందేశాన్ని ఇచ్చారు.
తన వ్యక్తిగత జీవితంలోని అత్యంత అరుదైన విషయాలను పంచుకుంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. తల్లిదండ్రులకు ఇచ్చే అత్యంత విలువైన కానుక వారు కోరుకునే ‘సమయం’ మరియు ‘ప్రేమ’ అని ఆయన స్పష్టం చేశారు.
“నాకు పిల్లలు ఉన్నా, వారితో ఎంత సరదాగా ఉన్నా.. నేను మాత్రం మా నాన్నను 40 ఏళ్ల వయసు వచ్చే వరకు హగ్ చేసుకోలేదు. 2015 జీహెచ్‌ఎంసీ ఎన్నికల విజయం తర్వాతే మొదటిసారి ఆయన్ని ఆలింగనం చేసుకున్నాను. ఆ క్షణం నా జీవితంలో మర్చిపోలేనిది” అని కేటీఆర్ ఆ సంఘటనను చేసుకున్నారు.
మన సంస్కృతిలో తండ్రిపై భయభక్తులు ఉంటాయి కానీ, ప్రేమను వ్యక్తపరచడంలో సంకోచం ఉంటుందని, దాన్ని విడనాడి తల్లిదండ్రులను ప్రేమగా హత్తుకోవాలని ఆయన కోరారు.
నేటి యువత సోషల్ మీడియా, కెరీర్ వేటలో పడి కన్నవారిని విస్మరిస్తున్నారని.. వస్తువులు కొనివ్వడం కంటే వారితో కూర్చుని మాట్లాడటమే వారికి కొండంత ధైర్యాన్నిస్తుందని సూచించారు.
జీవితం చాలా చిన్నదని, తల్లిదండ్రులు మనతో ఉన్నప్పుడే వారిని గౌరవించుకోవాలని, వారు దూరమయ్యాక బాధపడటం వల్ల ప్రయోజనం ఉండదని హెచ్చరించారు. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ‘ట్రెండింగ్’ అవుతున్నాయి.







