Union Minister Kishan Reddy | చెన్నైలో నియోజకవర్గాల పునర్విభజనపై పలు పార్టీలు శనివారం సమావేశం కావడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. బీజేపీని వ్యతిరేకించే పక్షాలు కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే, కమ్యూనిస్టులు సమావేశమవడం.. ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు.
అసలు నియోజకవర్గాల పునర్విభజనకు అనుసరించాల్సిన విధి విధానాలు ఖరారు కానే కాలేదు, నియమ నిబంధనలు రూపొందించనే లేదు, కానీ దక్షిణాదికి అన్యాయం జరుగుతుందంటూ ఈ పార్టీలు ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు.
‘పైకి నియోజకవర్గాల పునర్విభజన అని చెప్తున్నప్పటికీ, వాస్తవానికి వారి ఎజెండా బీజేపీపై విషం కక్కడమేననేది స్పష్టమవుతోంది. తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో గ్యారెంటీల హామీల అమలు వైఫల్యాలతో కాంగ్రెస్, తమిళనాడులో అవినీతి కుటుంబ పాలనతో డీఎంకే తీవ్రమైన ప్రజా వ్యతిరేకతను ఎదుర్కుంటున్నాయి.
అటు బీఆర్ఎస్ అధికారం కోల్పోయి గత పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటూ గెలవలేకపోయింది, ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం పోటీ చేసే ధైర్యం కూడా చేయలేదు.
ఈ నేపథ్యంలో ప్రజల దృష్టి మళ్లించి, భావోద్వేగాలు రెచ్చగొట్టేందుకు ఉత్తరాది, దక్షిణాది అంటూ విభజన తీసుకువచ్చేందుకు కుట్రలు పన్నుతున్నాయి. 2014లో నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ తొలిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది.
వరుసగా మూడోసారి మోదీ అధికారంలోకి రావడమే కాదు, 15 రాష్ట్రాల్లో బీజేపీ సొంతంగా, మరో 6 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్డీఏ పక్షాలు అధికారంలో ఉన్నాయి. బీజేపీ రోజురోజుకు విస్తరిస్తూ ఉంటే, కాంగ్రెస్ కుచించుకుపోతుంది. నేడు కేవలం 3 రాష్ట్రాల్లోనే అధికారానికి పరిమితమైంది. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో.. వివిధ ఎజెండాలతో సమాజంలో అస్థిరత సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది.
2016లో JNUలో తుక్డే తుక్డే గ్యాంగ్ ను ముందుపెట్టి విభజన తీసుకొచ్చేందుకు ప్రయత్నించి విఫలమైంది. ఆ తర్వాత బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ, రిజర్వేషన్లు రద్దు చేస్తుందంటూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించే ప్రయత్నం చేసింది.
అవేవీ పారకపోవడంతో ఇప్పుడు డీలిమిటేషన్ కింద దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందంటూ కాంగ్రెస్ సరికొత్త కుట్రలకు తెరలేపింది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను ముందు పెట్టి ఉత్తర-దక్షిణ భారతదేశం మధ్య విభజన తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది.
తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే, ముఖ్యమంత్రి స్టాలిన్ కుటుంబపాలనపై తీవ్ర వ్యతిరేకత ఉంది. రూ.700 కోట్ల లిక్కర్ కుంభకోణం సహా వరుసగా స్కాములు బయటపడడం ఆ వ్యతిరేకతను మరింత పెంచుతున్నాయి. ప్రజల మధ్య భావోద్వేగాన్ని రెచ్చగొట్టేందుకు జాతీయ విద్యావిధానంలో త్రిభాషా సూత్రాన్ని చూపి, హిందీని బలవంతాన రుద్దుతున్నారని తప్పుడు కథనాన్ని తీసుకొచ్చారు.
ప్రయివేటు స్కూళ్లలో ఇప్పటికే త్రిభాషా సూత్రం అమలవుతుండడంతో ప్రజలు వాస్తవం అర్థం చేసుకుంటున్నారు. దీంతో డీలిమిటేషన్ లో తమిళనాడుకు, దక్షిణాదికి అన్యాయం అవుతుందన్న మరో కృత్రిమ వాదాన్ని స్టాలిన్ సృష్టించారు. దీనికి కాంగ్రెస్, బీఆర్ఎస్, కమ్యూనిస్టు తదితర పక్షాలు తందానా అంటున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే అన్న మా ఆరోపణలు నిజమని మరోసారి నిరూపితమైంది.
బీజేపీకి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి దేశహితమే సర్వప్రథమం. దేశంలో ఏ ఒక్క రాష్ట్రానికి అన్యాయం జరగకుండా.. అన్ని రాష్ట్రాలను సంప్రదించి, అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని, ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా, దేశహితమే లక్ష్యంగా డీలిమిటేషన్ చట్టాన్ని తీసుకొస్తారు.
ఈ విషయాన్ని స్వయంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు. అయినా, మోదీ ప్రభుత్వం దక్షిణాదికి అన్యాయం చేస్తుందంటూ విమర్శించడం కాంగ్రెస్ తదితర పక్షాల రాజకీయ అవకాశవాదం తప్ప మరొకటి కాదు.
వాస్తవానికి దక్షిణ భారతదేశం పట్ల మోదీ గారు ప్రత్యేక అభిమానాన్ని చాటుకుంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఉత్తర-దక్షిణం మధ్య విభజన తీసుకొస్తుంటే.. మోదీ గారు మాత్రం కాశీ తమిళ సంగమం, కాశీ తెలుగు సంగమం వంటి కార్యక్రమాలతో ఉత్తర-దక్షిణ భారతదేశం మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అన్ని భారతీయ భాషలకు, సంస్కృతులకు పెద్దపీట వేస్తున్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాకారం చేయాలన్న సంకల్పంతో మోదీ గారు అన్ని రాష్ట్రాలను అభివృద్ధి చేస్తున్నారు. దీంతో మోదీ గారికి, బీజేపీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ జీర్ణించుకోలేక కాంగ్రెస్ తదితర బీజేపీ ప్రత్యర్థులు అర్థంలేని అంశాలను తెరపైకి తీసుకొస్తున్నాయి.
ప్రజలెవరూ వీటిని విశ్వసించొద్దని కోరుతున్నాను. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ విధానానికి పెద్దపీట వేస్తున్న మోదీ ప్రభుత్వం, నియోజకవర్గాల పునర్విభజనతోనే కాదు, మరే విషయంలోనే దేశంలో ఏ ఒక్క రాష్ట్రానికి, ఏ ఒక్క ప్రాంతానికి అన్యాయం జరగనీయదని నేను హామీ ఇస్తున్నాను.” తన ప్రకటనలో పేర్కొన్నారు కిషన్ రెడ్డి.