Harish Rao News latest | స్థానిక సంస్థలు ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9పై రాష్ట్ర హైకోర్టు స్టే విధించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో బీఆరెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు.
ఆరు గ్యారెంటీల లాగే, 42% బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ డ్రామా చేస్తుందని మండిపడ్డారు. 55 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉండి కాంగ్రెస్ ఏనాడైనా బీసీ రిజర్వేషన్ల కోసం పాటు పడిందా అని ప్రశ్నించారు. మాయ మాటలు చెప్పి గత ఎన్నికల్లో బీసీలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ లబ్ది పొందాలని చేసిన కుట్రలు పటాపంచలయ్యాయని పేర్కొన్నారు.
22 నెలలుగా బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కొట్లాడాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గల్లీలో కొట్లాడుతున్నట్లు డ్రామా క్రియేట్ చేసారు తప్ప, బీసీలకు 42శాతం రిజర్వేషన్ సాధించడం పట్ల ఏనాడూ చిత్తశుద్ది ప్రదర్శించలేదని విమర్శించారు. బీసీల పట్ల తమకు నిజంగానే ప్రేమ ఉన్నట్లు చాటుకునేందుకు తూతూ మంత్రంగా జీవో ఇచ్చి కొత్త నాటకానికి తెరతీసారని స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేసారని ధ్వజమెత్తారు.
రేవంత్ రెడ్డి ఇప్పటికైనా డ్రామాలు అపాలన్నారు. బీసీల పట్ల నిజంగా చిత్తశుద్ది ఉంటే 42శాతం పెంపు విషయమై ఢిల్లీలో కొట్లాడాలని పార్లమెంట్ లో చట్టం చేయించి, షెడ్యుల్ 9లో చేర్పించాలని సవాల్ విసిరారు.









