Thursday 8th October 2026
12:07:03 PM
Home > క్రైమ్ > చిన్న గొడవ.. బంధువులతో కలసి భర్తను కొట్టి చంపిన భార్య!

చిన్న గొడవ.. బంధువులతో కలసి భర్తను కొట్టి చంపిన భార్య!

Delhi Software Engineer Murdered దేశ రాజధాని ఢిల్లీలోని నిహాల్ విహార్ ప్రాంతంలో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. వైవాహిక వివాదాలు, చిన్నపాటి మనస్పర్థల కారణంగా నోయిడాలోని ప్రముఖ ‘అడోబ్’ (Adobe) సంస్థలో ఏటా రూ. 60 లక్షల ప్యాకేజీతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న వినయ్ గుప్తా (31)ను అతని భార్య, ఆమె పుట్టింటి బంధువులు అతి క్రూరంగా కొట్టి చంపారు.

అసలేం జరిగింది?

బాధితుడు వినయ్ గుప్తాకు, గృహిణి అయిన రేఖతో మూడేళ్లన్నర క్రితం వివాహం జరిగింది. వీరికి కవల పిల్లలు (ఒక పాప, బాబు) ఉన్నారు. పిల్లవాడికి మందులు వేసే విషయంలో వినయ్, రేఖ దంపతుల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది.

వినయ్ గట్టిగా మాట్లాడటంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రేఖ, ఇంటి నుంచి బయటకు వెళ్లి 10 నిమిషాల్లో తన పుట్టింటి బంధువులను వెంటబెట్టుకుని తిరిగి వచ్చింది. రేఖతో పాటు ఆమె ఇద్దరు సోదరులు, వదిన, తండ్రి, మామ మరియు మరొక వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డారు.

ఆ సమయంలో వినయ్ వారికి తాగడానికి నీళ్లు ఇచ్చి, అతని తల్లి అల్పాహారం తేవడానికి లోపలికి వెళ్లారు. అంతలోనే ఆ బృందం వినయ్‌పై విచక్షణారహితంగా దాడికి దిగింది.

దాడి చేసిన వారు వినయ్‌ని పదేపదే కొడుతూ, గొంతు నులిమి, ఛాతీపై చేతులు, కాళ్లతో తీవ్రంగా తన్నారు. తల్లిదండ్రులు అడ్డుపడటానికి ప్రయత్నించినప్పటికీ వినయ్‌ను కాపాడుకోలేకపోయారు.

సిసిటీవిలు ఆఫ్ చేసి ముందస్తు కుట్ర..

ఈ దాడి ముందస్తు ప్రణాళికతోనే జరిగిందని, దాడికి ముందు రేఖ ఇంట్లోని సీసీటీవీ (CCTV) కెమెరాలను ఆపివేసిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దాడి అనంతరం వినయ్ కాళ్లపై నిలబడలేకపోవడంతో పొరుగు వ్యక్తి సహాయంతో ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

భార్యతో సహా నలుగురి అరెస్ట్..

విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలం నుంచి ఆధారాలు సేకరించాయి. ఈ దారుణ ఘటనపై పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 103(1) (హత్య), 3(5) కింద కేసు నమోదు చేశారు.

ప్రధాన నిందితురాలైన భార్య రేఖ, ఆమె ఇద్దరు సోదరులు మరియు మరొక వ్యక్తితో కలిపి మొత్తం నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. తరచూ గొడవలు పడుతూ తమ కుమారుడిని చంపుతామని బెదిరించిన రేఖ కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి తండ్రి డిమాండ్ చేస్తున్నారు.

You may also like
మరొకరితో మాట్లాడుతోందనే అనుమానంతో మోడల్ హత్య!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions