- ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
- ఉదయం 9:30 గంటలకు ఆరుట్లకు చేరుకోనున్న ముఖ్యమంత్రి
- విద్యార్థులతో కలిసి బ్రేక్‌ఫాస్ట్
CM Revanth Reddy To Inaugurate TPS | తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా రంగానికి సరికొత్త దిశను చూపిస్తూ, కార్పొరేట్ విద్యాసంస్థలకు గట్టి పోటీనిచ్చేలా ప్రజా ప్రభుత్వం విప్లవాత్మక అడుగు వేసింది.
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మక డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపుదిద్దుకున్న ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్’ (TPS) కాన్సెప్ట్ కు రేపు అధికారికంగా శ్రీకారం చుట్టనున్నారు.
రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్లలో నిర్మించిన సరికొత్త టీపీఎస్ పాఠశాలను సీఎం రేవంత్ రెడ్డి రేపు ఉదయం ప్రారంభించి, రాష్ట్ర విద్యా చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించనున్నారు.
సీఎం పర్యటన షెడ్యూల్..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఉదయం 9:30 గంటలకు ఆరుట్లకు చేరుకుంటారు. పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్ పైలాన్’ను సీఎం ఆవిష్కరిస్తారు. పాఠశాలలోని అత్యాధునిక డిజిటల్ క్లాస్‌రూమ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, డైనింగ్ హాల్, క్రీడా మైదానాలను ఆయన స్వయంగా పరిశీలిస్తారు.
విద్యార్థులతో బ్రేక్‌ఫాస్ట్..
పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్కూల్ కమిటీ సభ్యులతో సీఎం ప్రత్యేకంగా సమావేశమై ముచ్చటిస్తారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఆయన అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్) చేయనున్నారు.
ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఒకే క్యాంపస్..
దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ‘విద్యా కమిషన్’ను ఏర్పాటు చేసి ప్రభుత్వ విద్యా బలోపేతానికి చర్యలు చేపట్టింది.
విద్యా కమిషన్ చైర్మన్ డాక్టర్ ఆకునూరి మురళి, సభ్యులు పీఎల్ విశ్వేశ్వర్ రావు, డాక్టర్ చారకొండ వెంకటేష్, జోష్నా శివారెడ్డిల ప్రత్యేక పర్యవేక్షణలో ఆరుట్ల టీపీఎస్ అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంది.
ఇక్కడ నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన జరుగుతుంది. చదువుతో పాటు స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌కు సమాన ప్రాధాన్యం ఇస్తారు.
సుదూర ప్రాంతాల విద్యార్థుల కోసం ఉచిత బస్సు సౌకర్యం (ప్రస్తుతం ఆరుట్లలో 5 బస్సులు) కల్పించారు. అలాగే విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం పోషక విలువలతో కూడిన భోజనం, సాయంత్రం స్నాక్స్ ఉచితంగా అందిస్తారు.
క్రికెట్, ఫుట్‌బాల్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, టెన్నిస్, క్యారమ్స్ మైదానాలతో పాటు ప్రత్యేక శిక్షకులను (కోచ్‌లను) నియమించారు. ఆధునిక తరగతి గదులు, జిమ్, లైబ్రరీ ఇక్కడి ప్రత్యేకతలు.
పైలట్ ప్రాజెక్ట్ నుంచి 100 స్కూళ్ల లక్ష్యం వైపు..
తెలంగాణ పబ్లిక్ స్కూల్ కాన్సెప్ట్‌లో భాగంగా ప్రభుత్వం తొలి విడతలో నాలుగు పాఠశాలలను పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేసింది.
రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల, మంచాల, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా: వంగూరు, పోల్కంపల్లిలో ఈ పైలట్ ప్రాజెక్టుల విజయవంతం ఆధారంగా రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా 100 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ను ఏర్పాటు చేయాలని ప్రజా ప్రభుత్వం భారీ కార్యాచరణను రూపొందించింది.
క్రేజ్ అదుర్స్.. ‘నో అడ్మిషన్’ బోర్డు!
కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా ఉన్న ఆరుట్ల టీపీఎస్ వాతావరణం చూసి తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించేందుకు క్యూ కడుతున్నారు. ప్రైవేట్ స్కూళ్ల నుంచి సైతం పిల్లలను ఇక్కడికి మారుస్తున్నారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో మొత్తం 1,814 మంది విద్యార్థులు చదువుతున్నారు.
ప్రీ-ప్రైమరీ: 150 మంది
ప్రైమరీ స్కూల్: 600 మంది
హైస్కూల్ (రెండు బ్లాకులు): 800 మంది
ఇంటర్ ప్రథమ సంవత్సరం: 160 మంది
ఇంటర్ ద్వితీయ సంవత్సరం: 104 మంది
తల్లిదండ్రుల నుంచి విపరీతమైన డిమాండ్ వస్తుండటంతో, సీట్లు భర్తీ అయి ప్రస్తుతం పాఠశాల వద్ద ‘నో అడ్మిషన్’ బోర్డు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందంటేనే ఈ ప్రాజెక్ట్ విజయం ఏంటో అర్థమవుతోంది.







