Amit Shah Affidavit | బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) శుక్రవారం గాంధీనగర్ పార్లమెంట్ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తులు, అప్పులు, కేసుల గురించి వివరాలను అమిత్ షా వెల్లడించారు.
తన పేరున రూ.36 కోట్ల విలువైన స్థిర చరాస్తులున్నట్టు అమిత్ షా తన ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. అయితే, ఆయన పేరుతో సొంత కారు కూడా లేకపోవడం గమనార్హం. రూ.20 కోట్ల విలువైన చరాస్తులు.. రూ.16 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్టు తెలిపారు.
ఇవే కాకుండా రూ.72 లక్షల విలువైన బంగారం, వెండి తనకు ఉన్నట్లు వెల్లడించారు. అమిత్ షా భార్య వద్ద ఉన్న రూ.1.10 కోట్ల విలువైన నగలు ఉన్నాయని అఫిడవిట్‌లో స్పష్టం చేశారు. ఇక అప్పుల విషయానికి వస్తే తనకు రూ.15 లక్షల రుణం ఉందని పేర్కొన్నారు.
తనపై మూడు క్రిమినల్ కేసులు ఉన్నట్టు చెప్పారు. అమిత్ షా సతీమణి సోనాల్ షా ఆస్తుల విలువ రూ.31 కోట్లుగా పేర్కొన్నారు. ఇందులో రూ.22.46 కోట్ల విలువైన చరాస్తులు, రూ.9 కోట్లు స్థిరాస్తులు ఉన్నాయి. ఆమె పేరిట రూ.26.32 లక్షల రుణాలు ఉండగా… ఆమె వార్షిక ఆదాయం రూ.39.54 లక్షలుగా వెల్లడించారు.
1997లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన అమిత్ షా గత 30 ఏళ్లుగా ఎమ్మెల్యేగా, ఎంపీగా సేవలందిస్తున్నారు. గత ఎన్నికల్లో తొలిసారి లోక్‌సభకు పోటీచేసి విజయం సాధించారు. గాంధీనగర్ నుంచి వరుసగా రెండోసారి బరిలోకి దిగుతున్నారు.