Wednesday 25th November 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘140 కోట్ల ప్రజల ఉద్యమంగా మారాలి..’ డ్రగ్స్ మాఫియాపై కిషన్ రెడ్డి ధ్వజం!

‘140 కోట్ల ప్రజల ఉద్యమంగా మారాలి..’ డ్రగ్స్ మాఫియాపై కిషన్ రెడ్డి ధ్వజం!

  • ‘నషా ముక్త్ భారత్ – హైదరాబాద్ వాక్స్’ పాదయాత్ర ప్రారంభం

Kishan Reddy Nasha Mukt Bharat Padayatra | ‘డ్రగ్స్ ఫ్రీ హైదరాబాద్, డ్రగ్స్ ఫ్రీ ఇండియా’ లక్ష్యంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి నాయకత్వంలో 3 రోజుల ‘నషా ముక్త్ భారత్ – హైదరాబాద్ వాక్స్’ (Hyderabad Walks for Nasha Mukt Bharat) పాదయాత్ర బుధవారం (నవంబర్ 25) అంబర్‌పేట్‌లో ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమైంది. అంబర్‌పేట్ మహంకాళి ఆలయం వద్ద ప్రారంభమైన ఈ యాత్రకు విద్యార్థులు, యువత, తల్లిదండ్రుల నుంచి విశేష స్పందన లభించింది.

వివిధ విద్యాసంస్థల విద్యార్థులు ‘సే నో టు డ్రగ్స్’ ప్లకార్డులు పట్టుకుని, డ్రగ్స్ వ్యతిరేక నినాదాలతో ప్రాంగణాన్ని హోరెత్తించారు. కిషన్ రెడ్డి జాతీయ జెండా చేతబూని విద్యార్థులతో కలిసి నడిచారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యుడు డా. కె. లక్ష్మణ్, సినీ నటుడు ‘విక్టరీ’ వెంకటేశ్ తదితరులు పాల్గొని మద్దతు తెలిపారు.

పాదయాత్ర రూట్ మ్యాప్..

అంబర్‌పేట్ మహంకాళి ఆలయం వద్ద ప్రారంభమై ఉస్మానియా యూనివర్సిటీ, ఆర్ట్స్ కాలేజ్, ఇఫ్లూ (EFLU), గాంధీ ఆస్పత్రి మీదుగా ముషీరాబాద్‌లోని కశిష్ ఫంక్షన్ హాల్ వరకు సాగుతుంది. రాత్రికి కిషన్ రెడ్డి అక్కడే బస చేస్తారు. గురు, శుక్రవారాల్లోనూ పాదయాత్ర కొనసాగి జూబ్లీహిల్స్, ఫిల్మ్ నగర్ వరకు సాగనుంది.

ఇది ప్రజా ఉద్యమం..

‘నషా ముక్త్ భారత్’ అనేది రాజకీయ కార్యక్రమం కాదని, 140 కోట్ల ప్రజల ఉద్యమమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. స్కూళ్లు, కాలేజీలు, బస్తీల వద్ద చాక్లెట్లు, బిస్కెట్ల రూపంలో డ్రగ్స్ అలవాటు చేస్తున్న దుర్మార్గుల ఆట కట్టిస్తామని హెచ్చరించారు. డ్రగ్స్ తయారీ, సరఫరా, విక్రయదారులను చట్టం ముందు నిలబెట్టే వరకు విశ్రమించబోమని తేల్చిచెప్పారు. విక్టరీ వెంకటేశ్ రాకతో పోరాటంలో విజయం మనదేనన్న ధీమా వ్యక్తం చేశారు.

2029 నాటికి డ్రగ్స్ ఫ్రీ ఇండియా..

భారత యువశక్తిని దెబ్బతీసేందుకు శత్రుదేశాలు, దేశద్రోహ శక్తులు డ్రగ్స్‌ను ఆయుధంగా వాడుకుంటున్నాయని డా. లక్ష్మణ్ ఆరోపించారు. 2029 నాటికి ‘డ్రగ్ ఫ్రీ ఇండియా’ లక్ష్యంగా పనిచేస్తున్నామని, రాష్ట్రంలో ‘ఈగల్ ఫోర్స్’ డేగకన్నుతో పనిచేస్తోందని తెలిపారు. ర్యాంకులు, టాపర్ల పేరుతో పిల్లలపై మానసిక ఒత్తిడి పెట్టవద్దని తల్లిదండ్రులకు సూచించారు.

మాదకద్రవ్యాల వ్యసనం దేశ సమగ్రతకు ముప్పుగా మారుతోందని మాజీ గవర్నర్ దత్తాత్రేయ ఆందోళన వ్యక్తం చేశారు. ‘నషా ముక్త్ భారత్’ సాధించాలంటే ముందుగా ‘నషా ముక్త్ తెలంగాణ’ కావాలని, రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు మరింత చొరవ తీసుకోవాలని కోరారు.

యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి దేశాన్ని అగ్రస్థానంలో నిలపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ సామాజిక ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు.

You may also like
హైదరాబాద్ పేదలకు బంపర్ ఆఫర్.. ఆ ఇండ్లకు ఉచిత రిజిస్ట్రేషన్!
ఒక్క హారన్ కూడా మోగదు.. ఐజ్వాల్ ప్రజల క్రమశిక్షణకు ఆనంద్ మహీంద్రా ఫిదా!
రాంగ్ రూట్ రాక్షసత్వం: ఓయూ విద్యార్థిని దుర్మరణంపై సీపీ సజ్జనార్ ఆవేదన!
టాలీవుడ్‌లో మరో పెళ్లి బాజా.. కావ్య – కాలభైరవ నిశ్చితార్థం!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions