- ‘ఇందిరమ్మ టవర్స్’కు టీజీ రెరా గ్రీన్ సిగ్నల్..
- మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Free Registration For Indiramma Towers గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పేదలకు సొంతింటి కలను సాకారం చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘ఇందిరమ్మ టవర్స్’ (Indiramma Towers) ప్రాజెక్టు మరో కీలక మైలురాయిని దాటింది.
ఈ టవర్ల ద్వారా ఒక్కో లబ్ధిదారుడికి దాదాపు రూ. 50 నుంచి రూ. 60 లక్షల విలువైన ఆస్తిని సమకూర్చడంతో పాటు, ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి అందించనున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
ఇందిరమ్మ టవర్స్‌కు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (TG RERA) లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిందని మంత్రి ‘ఎక్స్’ (X) వేదికగా ప్రకటించారు. ప్రభుత్వ గృహ నిర్మాణ ప్రాజెక్టు చరిత్రలోనే తొలిసారిగా రెరాలో నమోదు కావడం ప్రజా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి, నిబద్ధతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
లక్ష ఫ్లాట్ల నిర్మాణమే లక్ష్యం..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పేదల కోసం ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పరిధిలో దాదాపు లక్ష ఫ్లాట్లను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా తొలి దశలో మలక్‌పేట, కుత్బుల్లాపూర్ వంటి ప్రాంతాల్లో చేపట్టిన ఇందిరమ్మ టవర్లకు టీజీ రెరా అనుమతులు లభించాయి. ప్రభుత్వం ఉచితంగా స్థలాన్ని అందించడమే కాకుండా, లబ్ధిదారుల పేరిట అవిభక్త భూమి వాటాను (Undivided Share of Land – UDS) అధికారికంగా నమోదు చేయనుంది.
రెరా గుర్తింపుతో లబ్ధిదారులకు ప్రయోజనాలు..
ఈ ప్రాజెక్టుకు రెరా గుర్తింపు లభించడంతో లబ్ధిదారుల యాజమాన్య హక్కులకు పూర్తి చట్టబద్ధమైన రక్షణ ఉంటుంది. లబ్ధిదారులు తమ వాటా సొమ్ము చెల్లించడానికి వివిధ బ్యాంకుల నుంచి గృహ రుణాలు (Home Loans) పొందడం మరింత సులభతరం అవుతుంది. నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసి, లబ్ధిదారులకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసిన సేల్ డీడ్లను (Sale Deeds) అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.











