- కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అభినందనలు, దీపావళి శుభాకాంక్షలు!
Singareni Workers PLR Bonus సింగరేణి కార్మికులకు దీపావళి పండుగ వేళ కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. జాతీయ కార్మిక సంఘాలతో కూడిన కోలిండియా సంయుక్త సంప్రదింపుల కమిటీ సమావేశ నిర్ణయం మేరకు అర్హులైన సింగరేణి కార్మికులకు రూ.1,10,250 చొప్పున పర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డు (PLR) బోనస్ ఇవాళ అందనుండటంపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. బొగ్గు గని కార్మికులకు అభినందనలు తెలుపుతూ, వారి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.
దసరా లాభాల వాటాతో పాటు PLR బోనస్ ధమాకా..
కోల్‌కతాలోని కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) ప్రధాన కార్యాలయంలో జరిగిన సంప్రదింపుల కమిటీ భేటీలో 2025–26 ఆర్థిక సంవత్సరపు పనితీరు ఆధారంగా ఒక్కో కార్మికుడికి రూ.1,10,250 PLR బోనస్ అందించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇప్పటికే దసరా పండుగ సందర్భంగా సింగరేణి లాభాల వాటా కింద ఒక్కో కార్మికుడికి సగటున రూ.1,53,912 అందిచారని, ఇప్పుడు అదనంగా PLR బోనస్ తోడవడంతో పండుగ పూట కార్మికుల కుటుంబాల్లో మరింత ఆర్థిక ప్రయోజనం చేకూరిందని సంతోషం వ్యక్తం చేశారు.
దేశ ఇంధన భద్రతకు వెన్నెముక..
“భూగర్భంలో ప్రతికూల పరిస్థితులలో నిరంతరం శ్రమిస్తూ దేశ ఇంధన అవసరాలను తీర్చడంలో, పారిశ్రామిక రంగానికి తోడ్పడటంలో సింగరేణి కార్మికుల పాత్ర ఎంతో విలువైనది. దేశానికి వెలుగులు పంచే కార్మికులు దేశ ఇంధన భద్రతకు వెన్నెముకగా నిలుస్తున్నారు” అని మంత్రి కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం బొగ్గు రంగాభివృద్ధితో పాటు కార్మికుల భద్రత, మెరుగైన పని పరిస్థితులు, వారి కుటుంబాల ఆర్థిక భరోసాకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. కార్మికుల జీవితాల్లో నిరంతరం వెలుగులు నింపేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.











