Diwali Celebrations In Indiramma Houses రాష్ట్రంలోని నిరుపేదల సొంతింటి కలను సాకారం చేస్తూ తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకంలో ఇప్పటివరకు 2,21,500 ఇళ్లలో గృహప్రవేశాలు పూర్తయ్యాయని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఈ దీపావళి పండగ సందర్భంగా గృహప్రవేశం చేసిన ప్రతి ఇందిరమ్మ ఇంట్లో ప్రత్యేకంగా దీపావళి వేడుకలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.
బుధవారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కేంద్రంలో ఐటీ శాఖ మంత్రి, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి పొంగులేటి ఈ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి వేడుకలు” పోస్టర్‌ను మంత్రులిద్దరూ ఆవిష్కరించారు.
ప్రజా ప్రభుత్వ సంకల్పానికి ప్రతీక..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆర్థిక అవరోధాలు ఉన్నప్పటికీ తొలి విడత కింద 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. ఇందులో 2,21,500 ఇళ్ల నిర్మాణాలు పూర్తయి గృహప్రవేశాలు జరగ్గా, మరో 1.90 లక్షల ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని వివరించారు.
దీపావళి రోజున ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, గృహ నిర్మాణ శాఖ అధికారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి ఆనందంలో భాగస్వాములు కావాలని కోరారు. ఆ రోజున పేదల ఇంట్లో వెలిగే ప్రతీ దీపం తెలంగాణ ప్రజా ప్రభుత్వ సంకల్పానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు.
నాలుగు కార్పొరేషన్లలో ‘ఇందిరమ్మ టవర్స్’..
నగరాలు, పట్టణాలలో నివసించే పేదల కోసం ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన ప్రాజెక్టుల వివరాలను మంత్రి వెల్లడించారు. హైదరాబాద్ తరహాలోనే రాష్ట్రంలోని నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ కార్పొరేషన్లలో ‘జి+5’ (G+5) పద్ధతిలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం చేపడతామని, దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను దీపావళి లోగా జారీ చేస్తామని ప్రకటించారు. హైదరాబాద్‌లో నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్స్ నుంచి వచ్చే ఏడాది బోనాల నాటికి లబ్ధిదారుల చేత బోనాలు ఎత్తిస్తామని స్పష్టం చేశారు. తొలి విడత 4.50 లక్షల ఇళ్లతో పాటు, రెండో విడతలో 2.50 లక్షల ఇళ్లు, హైదరాబాద్ కోర్ ఏరియా పరిధిలో మరో లక్ష ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు.
అవినీతి రహితంగా నిధుల జమ..
రాష్ట్రవ్యాప్తంగా రూ.40,000 కోట్లతో చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపేది లేదని మంత్రి పొంగులేటి తేల్చిచెప్పారు. మధ్యవర్తులు, అవినీతికి తావులేకుండా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు ప్రతీ సోమవారం నేరుగా హైదరాబాద్ నుంచే నగదు జమ చేస్తున్నామని వివరించారు. గ్రామాలు, పట్టణాలే కాకుండా మారుమూల గిరిజన తండాల్లోనూ ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు.











