- ప్రభుత్వం సీరియస్, ఎఫ్‌ఐఆర్ నమోదుకు ఆదేశం!
AP Deputy CMO Warns Against Fake WhatsApp Channel ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం (Deputy CMO, AP) పేరును దుర్వినియోగం చేస్తూ సోషల్ మీడియాలో సృష్టిస్తున్న నకిలీ ఖాతాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ‘Deputy CMO, Andhra Pradesh’ పేరుతో కొందరు వ్యక్తులు వాట్సాప్‌లో నకిలీ ఛానల్‌ను నిర్వహిస్తున్నట్లు గుర్తించిన ఉప ముఖ్యమంత్రి కార్యాలయం దీనిపై తీవ్రంగా స్పందించింది. ఇది పూర్తిగా అనధికారిక నకిలీ ఛానల్ అని స్పష్టం చేస్తూ ప్రజలకు అధికారిక హెచ్చరిక జారీ చేసింది.
ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నం..
ఈ అనధికారిక వాట్సాప్ ఛానల్ ద్వారా డిప్యూటీ సీఎం కార్యాలయం పేరును, గుర్తింపును వాడుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే సమాచారాన్ని, ఎలాంటి సంబంధం లేని ఇతర అంశాలను ప్రచారం చేస్తున్నట్లు గుర్తించారు. ప్రభుత్వ కార్యాలయంగా తప్పుడు గుర్తింపుతో వ్యవహరించడం, ఉద్దేశపూర్వకంగా ఫేక్ సమాచారాన్ని వ్యాప్తి చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, ఇప్పటికే ఈ నకిలీ ఛానల్ వ్యవహారంపై ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదుకు తగిన చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. బాధ్యులైన వారిపై చట్టపరంగా కఠిన శిక్షలుంటాయని హెచ్చరించారు.
ప్రజలకు విజ్ఞప్తి..
ఈ నకిలీ ఛానల్‌ను ప్రజలు ఎవరూ విశ్వసించవద్దని, ఫాలో కావద్దని, అందులోని సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి ప్రామాణిక సమాచారం కోసమైనా కేవలం అధికారికంగా ధృవీకరించబడిన సోషల్ మీడియా ఖాతాలు, అధికారిక వాట్సాప్ ఛానల్‌ను మాత్రమే అనుసరించాలని కోరారు. ప్రభుత్వ కార్యాలయాల గుర్తింపును ఎవరైనా దుర్వినియోగం చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, బాధ్యులను చట్టం ముందు నిలబెడతామని డిప్యూటీ సీఎం కార్యాలయం స్పష్టం చేసింది.











