- అంబర్పేట్లో వైభవంగా ఉత్సవాలు!
Kishan Reddy Visits 72 Feet Bathukamma తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలు అంబర్పేట్లో మిన్నంటాయి. అంబర్పేట్ గ్రౌండ్లో ఘనంగా ప్రారంభంకానున్న బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 72 అడుగుల భారీ బతుకమ్మను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి శనివారం సందర్శించారు.
తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ భారీ బతుకమ్మను రూపొందించారు. ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వహణ తీరును, బతుకమ్మ ఏర్పాట్లను కేంద్రమంత్రి స్వయంగా పరిశీలించి, నిర్వాహకులను అభినందించడమే కాకుండా వేడుకల నిర్వహణపై పలు సూచనలు చేశారు.
బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల విశిష్టమైన పండుగ అని, పూలను పూజించే అరుదైన సంస్కృతి మనదని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. అంబర్పేట్ మైదానంలో ఏర్పాటు చేసిన ఈ 72 అడుగుల బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనిని తిలకించేందుకు పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ వేడుకల్లో వేలాది మంది మహిళలు పాల్గొని ఆటపాటలతో బతుకమ్మ ఆడనున్నారు. ఉత్సవాల కోసం మైదానంలో భారీ బందోబస్తు, లైటింగ్ సదుపాయాలు కల్పించారు.








