Kavitha Kalvakuntla Slams TG Government | ఎల్ నినో ప్రభావం మరియు రాష్ట్రంలో ముంచుకొస్తున్న తీవ్ర నీటి కొరతను ఎదుర్కోవడంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి కనీస దూరదృష్టి కొరవడిందని ఆరోపించారు. బంజారాహిల్స్లోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.
హెచ్చరికలను పట్టించుకోలేదు..
ఎల్ నినో ప్రభావంపై నిపుణులు ఏడాది ప్రారంభంలోనే స్పష్టమైన హెచ్చరికలు చేసినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని, సకాలంలో ముందస్తు నివారణ చర్యలు చేపట్టడంలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. పొరుగు రాష్ట్రాలు ఇప్పటికే కరవు పరిస్థితులను గుర్తించి, కరవు మండలాలను ప్రకటించి కేంద్రానికి నివేదికలు పంపాయని కవిత తెలిపారు. కానీ, ముందస్తు ప్రణాళికలు లేక ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రైతులను త్యాగాలు చేయాలని కోరడం దారుణమని మండిపడ్డారు.
నీటి కొరతపై ఆందోళన..
రాబోయే 10 నెలల కాలంలో రాష్ట్రం తీవ్ర నీటి కొరతను ఎదుర్కోనుందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చి దాదాపు 30 నెలలు గడుస్తున్నా, ఇప్పటికీ పాత ప్రభుత్వంపై నిందలు వేస్తూ తప్పించుకోవాలని చూడడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఉపాధి కోల్పోతున్న వ్యవసాయ కూలీలకు ఏటా ఇచ్చే రూ.12,000 పథకాన్ని తక్షణమే అమలు చేయాలని, కరవు పరిస్థితుల దృష్ట్యా వారికి జీవిత బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఆరోపణలు..
యాదాద్రి పవర్ ప్లాంట్ను ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఈ విషయమై ఏవైనా ప్రైవేటు కంపెనీలతో ఒప్పందాలు జరిగాయా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా రాజ్యాంగ విలువల గురించి గొప్పగా మాట్లాడుతూ, రాష్ట్రంలో మాత్రం పూర్తిగా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.











