Every Saturday Bank Holiday Fake News బ్యాంకులకు ప్రతి శనివారం సెలవు ప్రకటించారంటూ సోషల్ మీడియాలో ఒక గెజిట్ నోటిఫికేషన్ విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే ఈ గెజిట్ పూర్తిగా నకిలీదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సేవల విభాగం ఎలాంటి నోటిఫికేషన్ను జారీ చేయలేదని పీఐబీ వెల్లడించింది.
నకిలీ ప్రచారం..
ఎస్బీఐ సహా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్రం ప్రతి శనివారం సెలవు ప్రకటించిందని వైరల్ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రతి నెలా రెండో మరియు నాలుగో శనివారాలు మాత్రమే సెలవులు ఉన్నాయి. మిగిలిన శనివారాల్లో బ్యాంకులు యథాతథంగా పనిచేస్తాయి. బ్యాంకులకు 2వ, 4వ శనివారాలను సెలవులుగా ఇచ్చే నిబంధనను 2015లో అమల్లోకి తెచ్చారు.
పీఐబీ విజ్ఞప్తి..
సోషల్ మీడియాలో వచ్చే వైరల్ పత్రాలను చూసి వెంటనే నమ్మవద్దని పీఐబీ ప్రజలను కోరింది. అధికారిక వర్గాల ద్వారా నిర్ధారించుకున్న తర్వాతే సమాచారాన్ని షేర్ చేయాలని సూచించింది.
సమ్మె ఆలోచన విరమించిన ఉద్యోగ సంఘాలు..
వారానికి ఐదు రోజుల పని దినాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఇటీవల సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు సెప్టెంబర్ 27 ఆదివారం కూడా పనిచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే ఆ తర్వాత జరిగిన చర్చలు ఫలప్రదం కావడంతో ఉద్యోగ సంఘాలు తమ సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాయి.







