TG TMARS Bureau Telangana తెలంగాణ వ్యాప్తంగా ఎదురవుతున్న తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు, రోడ్డు ప్రమాదాలను అరికట్టే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ నిర్వహణను కేవలం చలానాలు విధించడానికే పరిమితం చేయకుండా.. అత్యంత శాస్త్రీయ పద్ధతులు, అత్యాధునిక సాంకేతికత, అత్యవసర వైద్య స్పందనను జోడిస్తూ ‘తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్మెంట్, రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరో’ (TG-TMARS) ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జీఓ 135 (GO 135) జారీ చేసింది.
సీఎం పరిధిలో ప్రత్యక్ష పర్యవేక్షణ..
‘రాష్ట్ర రోడ్డు భద్రతా మండలి’ (State Road Safety Council) పరిధిలో పనిచేసే ఈ నూతన వ్యవస్థ ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలోనే కొనసాగుతుంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఈ ప్రత్యేక విభాగానికి అదనపు డీజీపీ (ADGP) లేదా ఐజీపీ (IGP) స్థాయి అధికారి డైరెక్టర్గా వ్యవహరిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 32,000 కిలోమీటర్లకు పైగా రహదారులు, 1.8 కోట్లకు పైగా వాహనాల రాకపోకలను ఈ బ్యూరో నిరంతరం పర్యవేక్షిస్తుంది. రహదారులతో పాటు మెట్రో, రైల్వే భద్రత కూడా ఈ విభాగ పరిధిలోనే ఉంటుంది.
రోడ్ యాక్సిడెంట్ రెస్పాన్స్ ఆఫీసర్..
ప్రాణనష్టాన్ని నివారించేందుకు ప్రతి పోలీస్ స్టేషన్లో 24 గంటలూ అందుబాటులో ఉండేలా ‘రోడ్ యాక్సిడెంట్ రెస్పాన్స్ ఆఫీసర్’ ను నియమిస్తారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను ‘గోల్డెన్ అవర్’లో ఆసుపత్రికి తరలించడం వీరి ప్రధాన బాధ్యత. ఔటర్ రింగ్ రోడ్డు (ORR)తో పాటు 50 కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవున్న హైవేలపై స్పీడ్ డిటెక్టర్లు, అత్యాధునిక కెమెరాలతో కూడిన ‘హైవే పెట్రోలింగ్ యూనిట్లు’ నిరంతరం పహారా కాస్తాయి.
ప్రత్యేక నిధి – 40% జరిమానాలు మళ్లింపు..
బ్యూరో నిర్వహణకు ‘ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఫండ్’ ఏర్పాటు చేశారు. పోలీసులకు వచ్చే ట్రాఫిక్ చలానాల జరిమానాల్లో 40% మొత్తాన్ని నేరుగా ఈ నిధికే మళ్లిస్తారు. దీనిని సిబ్బంది శిక్షణ, అధునాతన సాంకేతికత, పెట్రోలింగ్ వాహనాలు మరియు అత్యవసర రోడ్డు మరమ్మతుల కోసం ఉపయోగిస్తారు.







