Thursday 27th August 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > శాండ్‌విచ్ షాప్‌ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రోబో!

శాండ్‌విచ్ షాప్‌ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రోబో!

Humanoid Robot Inaugurates Shop మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్‌లో ఒక కొత్త శాండ్‌విచ్ షాప్ ప్రారంభోత్సవానికి సాంప్రదాయ వీఐపీలకు బదులుగా ఒక ‘హ్యూమనాయిడ్ రోబో’ ముఖ్య అతిథిగా రావడం సోషల్ మీడియాలో తీవ్ర సంచలనంగా మారింది. ఆగస్టు 23, ఆదివారం నాడు జరిగిన ఈ అసాధారణ ఘటన, ఆధునిక సాంకేతికత మరియు భారతీయ సంస్కృతుల అరుదైన కలయికగా నిలిచింది.

బాడీగార్డులతో రోబోట్ ఎంట్రీ..

ఇండోర్‌కు చెందిన బిద్యుత్ ఇన్నోవేషన్ అనే సంస్థ ఈ రోబోను ప్రారంభోత్సవ స్థలానికి తీసుకువచ్చింది. బాడీగార్డ్స్ మధ్య వేదికపైకి వచ్చిన ఈ రోబోతో ప్రజలు కరచాలనం చేశారు.

ప్రవేశ ద్వారం వద్ద మెడకు గుడ్డ కట్టి సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికిన అనంతరం, అది షాప్ ప్రారంభోత్సవ పూజలో కూడా పాలుపంచుకుంది. కార్యక్రమం చివర్లో ఈ హ్యూమనాయిడ్ రోబో వివిధ రకాల నృత్య భంగిమలను ప్రదర్శిస్తూ అందరినీ ఆకట్టుకుంది.

హర్ష్ గోయెంకా ట్వీట్..

ప్రసిద్ధ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ఈ వీడియోను తన ‘X’ (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేస్తూ చమత్కారంగా స్పందించారు. “చైనీస్ యూనిట్రీ రోబోట్‌ను రీబ్రాండ్ చేసి, కాషాయ వస్త్రాలు, భద్రతా సిబ్బందితో ఒక శాండ్‌విచ్ షాప్ ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా తీసుకురావడం విశేషం. ఇది భారతదేశంలో మాత్రమే సాధ్యం!” అని రాసుకొచ్చారు.

నెటిజన్ల ఆసక్తికర కామెంట్లు..

ఈ వినూత్న ప్రచార ఎత్తుగడపై సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందించారు. “ఏదైనా ప్రముఖుడిని పిలిస్తే వచ్చే ప్రచారం కంటే ఈ రోబోట్ ఎక్కువ గుర్తింపు తెచ్చిపెట్టింది. వ్యాపారపరంగా ఇది సరైన వ్యూహం” అని కొందరు ప్రశంసించారు.

“మనవాళ్లు రోబోట్‌కు లడ్డూలు తినిపించడానికి ప్రయత్నించకపోవడం ఆశ్చర్యంగా ఉంది!” అని ఒకరు, “దుకాణంలో శాండ్‌విచ్‌లు తిని రోబోట్ బ్యాటరీ రీఛార్జ్ చేసుకుంటుంది” అని మరొకరు చమత్కరించారు. మానవ జీవితంలోకి, వ్యాపార రంగంలోకి రోబోట్‌లు నెమ్మదిగా ప్రవేశిస్తున్న తీరుకు ఇది ఉదాహరణ అని మరికొందరు వ్యాఖ్యానించారు.

You may also like
‘ఆగస్ట్ 25’న సంచలనం పేరుతో రూ.8.5 కోట్ల వసూలు?
3,400 లిప్‌స్టిక్ ముద్దులతో కార్‌ డెకరేషన్.. వైరల్ అయిన పిచ్చి ట్రెండ్!
ప్రేమలో విఫలమైతే 7 రోజులు పెయిడ్ లీవ్స్!
టమాట తోటలో ఉద్యోగం.. ఫ్రీగా టీ, కూల్ డ్రింక్స్’ జీతం ఎంతంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions