- పీపుల్స్ ప్లాజాలో చేనేత వస్త్ర ప్రదర్శన ప్రారంభించిన మంత్రి
National Handloom Day Telangana | చేనేత కార్మికుల సంక్షేమమే పరమావధిగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని, దేశానికి అన్నం అందించే రైతన్నకు, వస్త్రం అందించే నేతన్నకు ఒకేసారి ప్రాతినిధ్యం వహించే అవకాశం తనకు లభించడం గర్వకారణమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
రైతు సంక్షేమంతో పాటు చేనేత రంగ పునరుజ్జీవనాన్ని ప్రభుత్వం సమాన ప్రాధాన్యంతో ముందుకు తీసుకెళ్తోందని, ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారాల ప్రదానం
కార్యక్రమంలో భాగంగా చేనేత రంగానికి విశిష్ట సేవలు అందించిన కళాకారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొండా లక్ష్మణ్ బాపూజీ చేనేత పురస్కారాలను అందజేసి, ఘనంగా సత్కరించారు.
పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. ఆగస్టు 7 నుండి 16 వరకు కొనసాగే ఈ ప్రదర్శనలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు ఏర్పాటు చేసిన 100కు పైగా స్టాల్స్‌ను ఆయన సందర్శించారు.
గద్వాల చీరలు, పోచంపల్లి ఇక్కత్, నారాయణపేట వస్త్రాలు, సిద్దిపేట గొల్లభామ చీరలు, వరంగల్ దర్రీస్, కరీంనగర్ బెడ్‌షీట్లు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయని, ప్రజలంతా ఈ ప్రదర్శనను సందర్శించి చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా నేతన్నలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.
చేనేత సంక్షేమానికి నిధుల వరద – రూ. 980 కోట్లు విడుదల..
చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న పలు కీలక పథకాలను మంత్రి వివరంగా వెల్లడించారు. గత ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన రూ.500 కోట్ల బకాయిలతో సహా మొత్తం రూ.980 కోట్లు విడుదల చేసి చేనేత రంగానికి ఆర్థిక ఊతం ఇచ్చామని తెలిపారు.
పథకాల అమలు: నేతన్న భరోసా కింద చేనేత కార్మికులకు ఏడాదికి రూ.18,000, అనుబంధ కార్మికులకు రూ.6,000 ఆర్థిక సాయం కోసం రూ.15 కోట్లు, రుణమాఫీకి రూ.49.27 కోట్లు, నేతన్నకు చేయూత కింద రూ.304 కోట్లు, మరమగ్గ కార్మికుల సంక్షేమానికి రూ.44 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు.
నేతన్నకు భద్రత పథకం ద్వారా మరణించిన చేనేత కార్మికుడి కుటుంబానికి రూ.5 లక్షల బీమా సాయం అందిస్తున్నామన్నారు. చేనేత కార్మికుల జియో ట్యాగింగ్‌లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (IIHT) విద్యార్థి వగ్గు శ్రీరామ్ రూపొందించిన ‘ఎర్గోనామిక్ బ్యాక్ సపోర్ట్ సిస్టమ్’ జాతీయ స్థాయిలో మొదటి బహుమతి సాధించడం గర్వకారణమన్నారు.
దశాబ్దకాలంగా పెండింగ్‌లో ఉన్న చేనేత సహకార సంఘాల ఎన్నికలను నిర్వహించి ప్రజాస్వామ్య వ్యవస్థను పునరుద్ధరించామని చెప్పారు.
ఈ వేడుకలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి దనసరి అనసూయ (సీతక్క), జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సబ్యసాచి ఘోష్, టెస్కో అధికారులు, చేనేత రంగ ప్రముఖులు, అవార్డు గ్రహీతలు, సహకార సంఘాల ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో చేనేత కార్మికులు పాల్గొన్నారు.








