Sonu Sood on Kangana Ranaut Comments | బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మరోసారి తన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల జంతర్‌మంతర్ తదితర ప్రాంతాల్లో నిరసనలు తెలుపుతున్న జెన్-జీ యువతను ఉద్దేశిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి.
నిరసనకారులను “గట్టర్ జనరేషన్”గా సంబోధించిన కంగనా, వారి సోషల్ మీడియా రీల్స్ “వాంతులు తెప్పించేలా ఉన్నాయి” అంటూ విమర్శించారు. అంతేకాకుండా, యువత తమ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.
కంగనా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీయగా, ప్రముఖ నటుడు సోనూ సూద్ ఈ వ్యవహారంపై స్పందించారు.
కంగనా నిజంగానే అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే అది అత్యంత సిగ్గుచేటని అన్నారు. యువతే నటులను, రాజకీయ నాయకులను ప్రజల్లో నిలబెడుతుందని, వారిని కించపరిచేలా మాట్లాడకూడదని హితవు పలికారు.
“యువత మన వెన్నంటి ఉన్నంత కాలమే మన ఎదుగుదల ఉంటుంది. ప్రజలే దేవుళ్లు. అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లాలి. వారు లేకపోతే మనకు గుర్తింపు ఉండదు. వృత్తి ఏదైనా ప్రజలతో కలిసి ఉండాలి. మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి” అని సోనూ సూద్ పేర్కొన్నారు.
ప్రస్తుతం కంగనా వ్యాఖ్యలు, వాటిపై సోనూ సూద్ స్పందన సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ఇరువురి వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.











