Tamil Nadu Construction Material Ban | తమిళనాడులో పెరుగుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి, గృహ నిర్మాణ ప్రాజెక్టుల కారణంగా నిర్మాణ సామగ్రికి భారీగా డిమాండ్ పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు ముడి రాళ్లు, ఎం-శాండ్, మెటల్ జెల్లీతో పాటు ఇతర నిర్మాణ కంకర రవాణాపై మూడు నెలలపాటు నిషేధం విధించింది.
ముఖ్యమంత్రి విజయ్ అధ్యక్షతన మంగళవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశం అనంతరం ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. అయితే పుదుచ్చేరి, కారైకల్ కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ నిషేధం వర్తించదని స్పష్టం చేసింది.
రాష్ట్ర అవసరాలే ప్రధాన కారణం
ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం, తమిళనాడులో పట్టణీకరణ వేగంగా జరుగుతుండటంతో పాటు మౌలిక సదుపాయాలు, గృహ నిర్మాణం, పారిశ్రామిక ప్రాజెక్టులు భారీ స్థాయిలో కొనసాగుతున్నాయి.
దీంతో నిర్మాణ సామగ్రికి డిమాండ్ గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలోని క్వారీల నుంచి ఉత్పత్తి అవుతున్న ముడి రాళ్లు, కంకర స్థానిక అవసరాలకు కూడా సరిపోవడం లేదని ప్రభుత్వం పేర్కొంది.
పొరుగు రాష్ట్రాలకు భారీ ఎత్తున నిర్మాణ సామగ్రి తరలిపోవడం వల్ల రాష్ట్రంలో కృత్రిమ కొరత ఏర్పడి ధరలు పెరుగుతున్నాయని, అందుకే ఈ తాత్కాలిక నిషేధం విధించినట్లు వెల్లడించింది.
ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
ఈ నిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని సరిహద్దు జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఖనిజాల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించింది.
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తమిళనాడు అక్రమ మైనింగ్, రవాణా మరియు ఖనిజాల నిల్వ నిరోధక చట్టం-2011తో పాటు ఇతర చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
కేరళ నుంచి మినహాయింపు విజ్ఞప్తి
ఈ నిర్ణయంపై కేరళ ప్రభుత్వం స్పందించింది. కేరళ ముఖ్యమంత్రి సతీసన్ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు లేఖ రాస్తూ, జాతీయ రహదారి ప్రాజెక్టులు, ఇతర కీలక మౌలిక సదుపాయాల పనుల కోసం అవసరమైన నిర్మాణ సామగ్రి రవాణాకు మినహాయింపు ఇవ్వాలని కోరారు.
తిరునెల్వేలి, తెన్కాసి, కన్యాకుమారి జిల్లాల నుంచి వచ్చే రాతి కంకరపై కేరళలోని పలు జాతీయ రహదారి ప్రాజెక్టులు ఆధారపడి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
ఈ నిషేధం కొనసాగితే జాతీయ ప్రాజెక్టులు, విజింజం అంతర్జాతీయ ఓడరేవు, వల్లార్పడం కంటైనర్ టెర్మినల్‌కు అనుసంధానమైన పనులు ఆలస్యమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
రెండు రాష్ట్రాలు పరస్పర సహకారంతో ఈ సమస్యకు పరిష్కారం కనుగొంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.











