Thursday 9th July 2026
12:07:03 PM
Home > క్రైమ్ > ప్రభుత్వ ఉద్యోగం, ఆస్తి కోసం కన్నతల్లిపై ‘సుపారీ’ హత్య!

ప్రభుత్వ ఉద్యోగం, ఆస్తి కోసం కన్నతల్లిపై ‘సుపారీ’ హత్య!

  • జైపూర్‌లో 23 ఏళ్ల కూతురి ఘాతుకం.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరణ!

Daughter Kills Mother For Govt Job | కన్నతల్లి ప్రేమను, రక్తసంబంధాన్ని కాదని.. కేవలం ప్రభుత్వ ఉద్యోగం, కోట్లాది రూపాయల ఆస్తిని చేజిక్కించుకోవడం కోసం ఓ కూతురు అత్యంత దారుణానికి ఒడిగట్టింది.

తన సొంత మామ, కజిన్‌లతో కలిసి కన్నతల్లిని చంపేందుకు ఏకంగా రూ. 7 లక్షల సుపారీ (కిరాయి) ఇచ్చి ఘోర హత్యకు పాల్పడింది.

ఆ హత్యను ఎవరికీ అనుమానం రాకుండా రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు స్పీడ్‌గా వస్తున్న స్కార్పియో ఎస్‌యూవీ (Scorpio SUV) తో తల్లిని ఢీకొట్టించింది. జైపూర్‌లో సంచలనం సృష్టించిన ఈ దారుణ ఉదంతాన్ని పోలీసులు చేధించి, కూతురితో సహా ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

కారుణ్య నియామకమే వివాదానికి కారణం..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు నీరజ్ శర్మ (45) కోర్టులో లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)గా పనిచేసేవారు. ఆమె భర్త ఏడాది క్రితం మరణించారు.

ఆయన మరణానంతరం ఆయుషి శర్మ (23) ఆ ప్రభుత్వ ఉద్యోగాన్ని తాను కోరుకుంది. అయితే, నిబంధనల ప్రకారం ఆ కారుణ్య నియామక ఉద్యోగాన్ని తల్లి నీరజ్ శర్మ స్వయంగా స్వీకరించారు.

దీనికి తోడు గత రెండు మూడు సంవత్సరాలుగా తల్లి, కూతుళ్ల మధ్య ఆస్తి వివాదాలు కూడా నడుస్తున్నాయి. ఉద్యోగం దక్కకపోవడం, ఆస్తిపై నియంత్రణ సాధించాలనే కసితో కూతురు ఆయుషి.. తల్లిని ఎలాగైనా వదిలించుకోవాలని స్కెచ్ వేసింది.

రూ. 7 లక్షల సుపారీ.. థార్‌తో రెక్కీ..

తల్లిని హతమార్చడానికి ఆయుషి తన మామ మోహన్ స్వరూప్, కజిన్ బలరామ్ అలియాస్ రవితో కలిసి కుట్ర పన్నింది. ఈ ముగ్గురూ కలిసి భరత్‌పూర్‌కు చెందిన హేమంత్ శర్మ అనే వ్యక్తిని రూ. 7 లక్షలకు కిరాయి హంతకుడిగా నియమించుకున్నారు.

నిందితులు మొదట అద్దెకు తీసుకున్న ‘థార్’ (Thar) ఎస్‌యూవీని ఉపయోగించి నీరజ్ శర్మ కదలికలపై నిఘా పెట్టారు. కానీ ఆ ప్రయత్నం విఫలమైంది. అయినప్పటికీ వదలకుండా దాదాపు ఒక నెల రోజుల పాటు ఆమె రోజువారీ కదలికలను నిశితంగా గమనిస్తూ రెక్కీ నిర్వహించారు.

Read Also: వరదలో కొట్టుకుపోయిన 3,000 గ్యాస్ సిలిండర్లు..

130 కి.మీ వేగంతో వచ్చి ఢీకొట్టిన స్కార్పియో..

జూలై 3న జైపూర్‌లోని ప్రతాప్ నగర్ ప్రాంతంలో నీరజ్ శర్మ తన కొడుకును కోచింగ్ సెంటర్‌లో దింపి కాలినడకన ఇంటికి తిరిగి వస్తున్నారు.

నిందితులు పక్కా ప్లాన్ ప్రకారం ఆమె కదలికలను ట్రాక్ చేశారు. మోహిత్ శర్మ సమాచారం అందించగా, రోహిత్ జాతవ్ మోటార్‌సైకిల్‌పై నిఘా ఉంచాడు.

ఆకాష్ శర్మ, అరవింద్ శర్మలు ఉన్న స్కార్పియో వాహనం.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న నీరజ్ శర్మను గంటకు సుమారు 130 కిలోమీటర్ల అత్యంత వేగంతో వెనుక నుండి బలంగా ఢీకొట్టింది.

ఆ వేగానికి ఆమె శరీరం గాల్లోకి దాదాపు 100 అడుగుల ఎత్తుకు ఎగిరిపడటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన వెంటనే నిందితులు స్కార్పియోను అక్కడే వదిలేసి, మోటార్‌సైకిల్‌పై పారిపోయారు.

సీసీటీవీ ఫుటేజీతో తేలిన అసలు నిజం..

ఈ ఘటనపై నీరజ్ శర్మ సోదరుడు రాకేష్ కుమార్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలోనే ఆస్తి కోసం కూతురు, అత్తమామల కుటుంబం నీరజ్‌ను వేధిస్తున్నారని, చంపేస్తామని బెదిరించారని పేర్కొన్నారు.

పోలీసులు ఘటనా స్థలంలోని సీసీటీవీ (CCTV) ఫుటేజీలను నిశితంగా పరిశీలించగా.. అది యాదృచ్ఛికంగా జరిగిన ప్రమాదం కాదని, కావాలనే టార్గెట్ చేసి వేగంగా గుద్దినట్లు స్పష్టమైంది.

దీంతో దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు.. విచారణలో కూతురు ఆయుషి శర్మ తన నేరాన్ని అంగీకరించిందని డీసీపీ ఈస్ట్ రంజిత శర్మ వెల్లడించారు.

ఈ కేసులో ఆయుషి శర్మ, మోహన్ స్వరూప్, మోహిత్ శర్మ, ఆకాష్ శర్మ, అరవింద్ శర్మ, హేమంత్ శర్మ, రోహిత్ జాతవ్‌లను పోలీసులు అరెస్టు చేయగా, ముఖ్య సూత్రధారి అయిన కజిన్ బలరామ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions