Monday 24th August 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > వరదలో కొట్టుకుపోయిన 3,000 గ్యాస్ సిలిండర్లు..

వరదలో కొట్టుకుపోయిన 3,000 గ్యాస్ సిలిండర్లు..

  • నదిలో ప్రవహిస్తున్న దృశ్యాలు వైరల్!

LPG Cylinders Washed Away In Floods | మహారాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో రాయగఢ్ (Raigad) జిల్లాలో ఒక వింతైన, అత్యంత ప్రమాదకరమైన సంఘటన వెలుగుచూసింది.

వరద ఉధృతి ధాటికి ఒక గ్యాస్ బాట్లింగ్ ప్లాంట్ నుండి ఏకంగా 3,000 లకు పైగా ఎల్పీజీ (LPG) గ్యాస్ సిలిండర్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. నది నిండా వేలాది గ్యాస్ సిలిండర్లు తేలుతూ ప్రవహిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారాయి.

‘బాట్లింగ్ ప్లాంట్’ను ముంచెత్తిన వరద..

రాయగఢ్ జిల్లా పరిధిలోని పన్వెల్ తాలూకాలో గల ‘హెచ్‌పీసీఎల్’ (HPCL) పాతాళగంగ ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్ వద్ద భారీ సంఖ్యలో గ్యాస్ సిలిండర్లను నిల్వ ఉంచారు.అకస్మాత్తుగా ప్లాంట్‌ను ముంచెత్తిన వరద నీటి మూలంగా అక్కడ ఉన్న సిలిండర్లన్నీ వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి.

Read Also: యూట్యూబ్ చూసి ‘హోమ్‌మేడ్ వైన్’ దందా!

ఆ తర్వాత ఈ సిలిండర్లన్నీ స్థానికంగా ఉండే ‘పాతాళగంగ’ నదిలోకి చేరి, వరద నీటితో పాటు కొట్టుకుపోతూ కనిపించాయి. కొట్టుకుపోయిన వాటిలో ఖాళీ సిలిండర్లతో పాటు పూర్తిగా గ్యాస్ నింపిన (Filled) సిలిండర్లు కూడా భారీగానే ఉన్నాయి.

‘ముట్టుకోవద్దు.. ఇంటికి తీసుకెళ్లొద్దు’: అధికారుల హెచ్చరిక!

వేల సంఖ్యలో సిలిండర్లు నదిలో కొట్టుకుపోతుండటాన్ని చూసిన స్థానికులు కొందరు వాటిని పట్టుకునేందుకు, ఇళ్లకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీనిపై రాయగఢ్ జిల్లా యంత్రాంగం, ఎక్సైజ్, విపత్తు నిర్వహణ అధికారులు తక్షణమే స్పందించి ప్రజలను అప్రమత్తం చేశారు.

“వరదల్లో కొట్టుకువస్తున్న గ్యాస్ సిలిండర్ల పట్ల ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎవరూ కూడా ఆ సిలిండర్లను తాకడం గానీ, నదిలోకి వెళ్లి వాటిని పట్టుకుని ఇళ్లకు తీసుకెళ్లడం వంటి పనులు అస్సలు చేయకూడదు.

వరద ఒత్తిడికి విడిభాగాలు దెబ్బతిని గ్యాస్ లీక్ అయ్యే ప్రమాదం ఉంది. ఒకవేళ లీకైతే పెను ప్రమాదానికి (పేలుళ్లకు) దారి తీసే అవకాశం ఉంది” అని హెచ్చరించారు.

ప్రస్తుతం రంగంలోకి దిగిన హెచ్‌పీసీఎల్ సిబ్బంది, స్థానిక యంత్రాంగం నదిలో ప్రవహిస్తున్న సిలిండర్లను సురక్షితంగా వెలికితీసేందుకు చర్యలు చేపట్టారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions