- లార్డ్స్ బాల్కనీ సీన్‌ను రీ-క్రియేట్ చేసిన రాజ్‌కుమార్ రావు!
Sourav Ganguly Biopic First Look | భారత క్రికెట్ చరిత్రను మలుపు తిప్పిన కెప్టెన్, ‘దాదా’గా కోట్లాది మంది అభిమానులు ప్రేమగా పిలుచుకునే సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) కి తన పుట్టినరోజున ఒక అపురూపమైన, మర్చిపోలేని బహుమతి లభించింది.
గంగూలీ జీవిత కథ ఆధారంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న బయోపిక్ ‘దాదా: ది సౌరవ్ గంగూలీ స్టోరీ’ (Dada: The Sourav Ganguly Story) ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆయన 54వ పుట్టినరోజు సందర్భంగా నేడు అధికారికంగా విడుదల చేశారు.
ఈ పోస్టర్ విడుదల తన పుట్టినరోజును మరింత ప్రత్యేకంగా మార్చిందని, ఇది తనకు లభించిన అత్యుత్తమ బర్త్ డే గిఫ్ట్ అని గంగూలీ భావోద్వేగానికి గురయ్యారు.
ఐకానిక్ ‘లార్డ్స్’ చొక్కా విప్పిన సీన్ రిపీట్:
ఈ బయోపిక్‌లో సౌరవ్ గంగూలీ పాత్రను జాతీయ అవార్డు గ్రహీత, బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు (Rajkummar Rao) పోషిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఐకానిక్, ఆవేశపూరిత క్షణాన్ని ప్రతిబింబించేలా డిజైన్ చేశారు.
నాట్‌వెస్ట్ ట్రోఫీ సంబరాలు..
2002లో లార్డ్స్ మైదానంలో జరిగిన నాట్‌వెస్ట్ ట్రోఫీ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై భారత్ చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత, కెప్టెన్ గంగూలీ లార్డ్స్ బాల్కనీలో చొక్కా విప్పి గిరగిరా తిప్పిన దృశ్యం క్రికెట్ ప్రపంచంలో ఎప్పటికీ నిలిచిపోతుంది.
ఆకట్టుకుంటున్న రాజ్‌కుమార్ రావు లుక్..
ఈ పోస్టర్‌లో వెనుక భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుండగా, చొక్కా లేకుండా లార్డ్స్ బాల్కనీలో నిలబడిన రాజ్‌కుమార్ రావు లుక్ ‘దాదా’ను తలపిస్తూ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆనాటి రోమాంచిత జ్ఞాపకాలను ఈ పోస్టర్ కళ్లకు కట్టింది.
‘నా క్రికెట్ ప్రయాణంలోని మధుర జ్ఞాపకం’..
గంగూలీ ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌పై సౌరవ్ గంగూలీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. “ఈ పోస్టర్ నా క్రికెట్ ప్రయాణంలోని ఒక మధురమైన జ్ఞాపకాన్ని గుర్తుచేసింది.
రాజ్‌కుమార్ రావు ఈ పాత్ర కోసం ఎంతో చిత్తశుద్ధితో, నిబద్ధతతో పనిచేస్తున్నారు. ఆయనకు, చిత్ర బృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు” అని తెలిపారు.
అంతేకాకుండా, 2027 మే 14న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతుందని, అప్పుడు అభిమానులు ఈ చిత్రాన్ని ఆదరిస్తారని ఆశిస్తున్నట్లు దాదా పేర్కొన్నారు.
వెండితెరపై ‘టీం ఇండియా’ స్వర్ణయుగం..
భారత క్రికెట్‌లో దూకుడును, విదేశాల్లో గెలవాలనే కసిని నూరిపోసిన కెప్టెన్‌గా గంగూలీకి ప్రత్యేక స్థానం ఉంది. 2000వ దశకం ప్రారంభంలో మ్యాచ్ ఫిక్సింగ్ కోరల్లో చిక్కుకున్న జట్టును గంగూలీ తన అద్భుత నాయకత్వంతో మళ్లీ నిలబెట్టారు.
ఆస్ట్రేలియా వరుసగా సాధించిన 15 టెస్ట్ విజయాల జైత్రయాత్రకు బ్రేక్ వేసి, 2001లో స్వదేశంలో 2-1 తేడాతో చారిత్రక సిరీస్ గెలవడం, 2004లో పాకిస్థాన్ గడ్డపై టెస్ట్ సిరీస్ విజయం, 2003-04లో ఆస్ట్రేలియాలో సిరీస్ డ్రా చేసుకోవడం మరియు 2003 ఐసీసీ ప్రపంచకప్ ఫైనల్‌కు జట్టును నడిపించడం వంటి అద్భుతాలు దాదా కెప్టెన్సీలోనే సాధ్యమయ్యాయి.
ఇప్పుడు ఈ చారిత్రక ఘట్టాలన్నీ వెండితెరపైకి రానుండటంతో అటు క్రికెట్, ఇటు సినీ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.







