కేటీఆర్, హరీష్ రావులకు మంత్రి జూపల్లి బహిరంగ లేఖ!
Minister Jupally Open Letter To KTR Harish Rao | తెలంగాణ రాష్ట్ర అప్పుల అంశంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య పొలిటికల్ వార్ మరోసారి ముదిరింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అప్పులపై రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఈ ఆర్థిక భారంపై చర్చించేందుకు బీఆర్ఎస్ పార్టీ అగ్ర నేతలు, వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్), మాజీ ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావులకు ఆయన ఒక బహిరంగ లేఖ రాశారు.
రాష్ట్ర అప్పుల నివేదికలపై వాస్తవాలు తేల్చడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటిస్తూ.. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరారు. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు రావాలని ఆయన డిమాండ్ చేశారు.
రూ.72 వేల కోట్ల నుండి రూ.8.21 లక్షల కోట్లకు అప్పులు..
మంత్రి జూపల్లి కృష్ణారావు తన బహిరంగ లేఖలో గత కేసీఆర్ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణను తప్పుబడుతూ పలు కీలక గణాంకాలను వెల్లడించారు.2014 జూన్ 2వ తేదీన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన సమయంలో రాష్ట్రంకున్న మొత్తం బకాయి అప్పు కేవలం రూ.72,658 కోట్లు మాత్రమేనని జూపల్లి గుర్తుచేశారు.
కానీ, తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలన ముగిసి, 2023 డిసెంబర్ 1వ తేదీ నాటికి వారు అధికారాన్ని వీడే సమయానికి ఆ అప్పుల భారం ఊహించని స్థాయికి చేరిందని మండిపడ్డారు.
రూ.8.21 లక్షల కోట్ల ఆర్థిక భారం..
బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులు, వివిధ ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన పెండింగ్ బిల్లులు అన్నింటినీ కలిపి మొత్తం రూ.8,21,651 కోట్ల భారీ ఆర్థిక భారాన్ని తెలంగాణ రాష్ట్రంపై మిగిల్చి వెళ్లారని జూపల్లి తీవ్ర ఆరోపణలు చేశారు.
తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టేసిన బీఆర్ఎస్ నేతలకు మంత్రి జూపల్లి తన లేఖ ద్వారా కొన్ని సూటి ప్రశ్నలను సంధించారు.
“తెలంగాణ రాష్ట్రానికి అసలు ఇన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది? అంత భారీగా తెచ్చిన అప్పులతో రాష్ట్రంలో నిర్మించిన శాశ్వత వనరులు ఏంటి? ప్రజలకు చేకూరిన లబ్ధి ఎంత?
వీటన్నింటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీఆర్ఎస్ అగ్ర నాయకత్వానికి ఉంది. ఈ విషయాలపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ప్రజల సాక్షిగా తేల్చుకుందాం, చర్చకు రండి.” జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరారు.
ఈ ఓపెన్ ఛాలెంజ్ మరియు బహిరంగ లేఖ ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. దీనిపై బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.







