Tuesday 23rd June 2026
12:07:03 PM
Home > తాజా > నేటి నుంచే ‘విత్తన మేళాలు’.. రైతు వేదికల్లో నాణ్యమైన విత్తనాలు అందుబాటులోకి!

నేటి నుంచే ‘విత్తన మేళాలు’.. రైతు వేదికల్లో నాణ్యమైన విత్తనాలు అందుబాటులోకి!

Telangana Rythu Vedika Seed Melas | తెలంగాణలోని అన్నదాతలకు ఒకే చోట నాణ్యమైన, ధ్రువీకరించిన విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 2,601 రైతు వేదికల్లో నేటి నుండి (జూన్ 23) జూన్ 30వ తేదీ వరకు వారం రోజుల పాటు భారీ ‘విత్తన మేళాలు’ (Seed Melas) నిర్వహించనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు.

ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులను తట్టుకునేలా రైతులను ఆరుతడి పంటల వైపు ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ మేళాలను ప్రభుత్వం డిజైన్ చేసింది.

ఆరుతడి పంటలకు పెద్దపీట..

ప్రస్తుత సీజన్‌లో వర్షాల కొరతను అధిగమించేందుకు పప్పుధాన్యాలు, నూనెగింజలు, చిరుధాన్యాలు మరియు కూరగాయల సాగుపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు వీటన్నింటికీ సంబంధించిన ధ్రువీకరించిన (Certified) నాణ్యమైన విత్తనాలను సరసమైన ధరలకే ఇక్కడ విక్రయిస్తారు.

పప్పుధాన్యాలు & నూనెగింజలు..

పెసర, మినుము, కంది వంటి పప్పుజాతి పంటల విత్తనాలతో పాటు నువ్వులు, వేరుశెనగ వంటి నూనెగింజల విత్తనాలు ఇక్కడ లభిస్తాయి. వివిధ రకాల చిరుధాన్యాలు (Millets), అలాగే అధిక దిగుబడినిచ్చే రకాల కూరగాయల విత్తనాలను ఒకే వేదికపై అందుబాటులో ఉంచారు.

ప్రముఖ సన్న వరి రకాలు.. మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న పలు రకాల సన్న బియ్యం వరి విత్తనాలను కూడా ఈ మేళాలో ఉంచారు.

ఇందులో ముఖ్యంగా..

బీపీటీ–5204 (BPT-5204) తెలంగాణ సోనా (Telangana Sona) జైశ్రీరామ్ (Jai Sriram) కేఎన్‌ఎం–1638 (KNM-1638), కేఎన్‌ఎం–7715 డబ్ల్యూజీఎల్–44 (WGL-44), హెచ్‌ఎంటీ సోనా (HMT Sona) రాష్ట్రంలోని రైతులందరూ తమ పరిధిలోని రైతు వేదికలను సందర్శించి, ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు.

నకిలీ విత్తనాల బారిన పడకుండా అధికారికంగా ధ్రువీకరించిన విత్తనాలనే కొనుగోలు చేయాలని పేర్కొన్నారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions