Monday 15th June 2026
12:07:03 PM
Home > తాజా > కేంద్రం వివక్ష వల్లే ఫేజ్-2 ఆలస్యం: సీఎం రేవంత్ రెడ్డి!

కేంద్రం వివక్ష వల్లే ఫేజ్-2 ఆలస్యం: సీఎం రేవంత్ రెడ్డి!

CM Revanth Reddy On Hyderabad Metro | మెట్రో రైలు నిర్మాణ రంగంలో దేశంలోని ఇతర నగరాల కంటే హైదరాబాద్ వెనుకబడి ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

మొదటి దశలో 15 వేల కోట్ల రూపాయలతో పూర్తి కావాల్సిన మెట్రో రైలు నిర్మాణ వ్యయం.. కాలయాపన కారణంగా ఇప్పుడు 22 వేల కోట్ల రూపాయలకు పెరిగిందని ఆయన వెల్లడించారు.

సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గత కేసీఆర్ పాలనలో జనం ప్రయాణించాల్సిన అసలైన ప్రాంతాల్లో మెట్రో విస్తరణను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు.

మెట్రో రెండవ దశ విస్తరణ అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నామని సీఎం తెలిపారు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి పలు కీలక విషయాలను ఆయన మీడియాకు వివరించారు.

ఏడాదికి రూ.400 కోట్ల నష్టం..

మెట్రో నిర్వహణ వల్ల ఏడాదికి 400 కోట్ల రూపాయల నష్టం వస్తోందని ఎల్ అండ్ టీ (L&T) సంస్థ తెలిపిందని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా వారు విస్తరణకు ముందుకు రావడం లేదని సీఎం పేర్కొన్నారు.

30 వేల కోట్ల రూపాయల ఎల్ అండ్ టీ ఆస్తులను ప్రభుత్వం 15 వేల కోట్లకు కొనుగోలు చేసిందని రేవంత్ రెడ్డి చెప్పారు.

ఎల్ అండ్ టీకి ఉన్న 13,600 కోట్ల రూపాయల అప్పులను తీర్చేందుకు, ఐఆర్‌ఎఫ్‌సీ (IRFC) నుంచి 4 శాతం వడ్డీకే రుణాలు ఇప్పించామన్నారు.

అయితే, రేవంత్ రెడ్డిని తేలికగా పని చేయనిస్తే తెలంగాణలో బీజేపీకి ఇబ్బందులు వస్తాయని కేంద్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, అశ్విని వైష్ణవ్‌లకు కిషన్ రెడ్డి చెప్పారని ఆరోపించారు.

అందుకే రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినా ఐఆర్‌ఎఫ్‌సీ లోన్ డబ్బులు ఎల్ అండ్ టీకి బదిలీ కాకుండా కిషన్ రెడ్డి అడ్డుకున్నారని సీఎం ఆరోపించారు.

తెలంగాణపై కేంద్రం వివక్ష..

తెలంగాణ నుంచి కేంద్ర క్యాబినెట్‌లో ఉన్న కిషన్ రెడ్డికి హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత లేదా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.

కేసీఆర్, కేటీఆర్ కలిసి మెట్రో ఫేజ్-2ను అడ్డుకున్నారని, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి కేసీఆర్ సహకరించినందుకు గానూ కిషన్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్‌కు ‘గురుదక్షిణ’ చెల్లిస్తున్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

అహ్మదాబాద్, విశాఖపట్నం మెట్రోలకు అనుమతులు ఇచ్చి, హైదరాబాద్ ప్రాజెక్టును మాత్రం కేంద్రం ఆపిందని.. తెలంగాణపై కేంద్ర వివక్షకు ఇది పరాకాష్ట అని మండిపడ్డారు. కచ్చితంగా కేంద్ర ప్రభుత్వ మొండివైఖరి వల్లే మెట్రో ఫేజ్-2 ఆగిపోయిందని స్పష్టం చేశారు.

మోదీ రాజీనామా చేస్తే.. మేమూ చేస్తాం!

హైదరాబాద్‌కు 2023లోనే ట్రిపుల్ ఆర్ (RRR – Regional Ring Road) ప్రాజెక్టును కేంద్రం ప్రకటించినా, అది ఇప్పటికీ సాకారం కాలేదని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తామని ప్రధాని మోదీ ఇచ్చిన హామీలు నెరవేరలేదన్నారు.

“ఈ వైఫల్యాలన్నింటికీ బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ రాజీనామా చేస్తే.. మేము కూడా రాజీనామా చేస్తాం” అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.

You may also like
harish and revanth
రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన హరీష్ రావు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions